Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పి నారాయణ రెడ్డి, పి కృష్ణమూర్తి
- మహాసభలో పలు తీర్మానాలు అమోదం
- పెన్షనర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యమాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్(టీఏపీఆర్పీఏ) రాష్ట్ర ఐదో మహాసభలు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 15, 16 తేదీల్లో జరిగాయి. ఈ మహాసభలకు 28 జిల్లాల నుంచి 500మంది ప్రతినిధులుగా హాజరయ్యారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న అంశాలపై సభలో పలు తీర్మానాలను ఆమోదించారు. నూతన రాష్ట్ర కమిటిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు పి నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి కృష్ణమూర్తి, కోశాధికారిగా కే నాగేశ్వర్రావుతో పాటు ఉపాధ్యక్షులుగా 8మంది, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ మరో 7గురు, అర్గనైజింగ్ కార్యదర్శులుగా 12 మంది, కార్యదర్శులుగా 19మంది, అడిట్ కమిటి సభ్యులుగా ఇద్దరు, 62 మందిని కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. రెండు రోజుల మహాసభలో ఐదు తీర్మానాలు ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమండేషన్ ప్రకారంగా 65ఏండ్లకు చేరిని వారికి ఐదుశాతం, 70ఏండ్లకు చేరిన వారికి 10శాతం,75 ఏండ్లకు చేరిన వారికి 15శాతం ఎడిషనల్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీజీహెచ్ఎస్ వసతి లేనివారికి ఎఫ్ఎంఏ రూ.మూడు వేలు చిల్లించాలని తీర్మానించారు. కోల్‌మైన్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1500 నిర్ణయించాలనీ, మెడికల్ స్కీంలో వ్యత్యాసాలు తొలగించి, కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్‌లో ఉన్న మూడు డీఎలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్-95 పతకంలో దేశవ్యాప్తంగా 72లక్షల మంది నెన్షనర్లు ఉన్నారనీ, వారిలో రూ.1000లోపు పెన్షన్ పొందుతున్న వారు 40లక్షల మంది ఉన్నారనీ, సుప్రీంకోర్టు తీర్పువల్ల లబ్దిపొందేవారు 10లక్షలకు మించి ఉండరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్లు సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించి పెన్షనర్లను మోసం చేస్తున్నారని తెలిపారు.ఆన్ లైన్ ఆప్షన్ వల్ల లక్షలాది మంది పెన్షనర్లు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షనర్ల పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల మహాసభలో ఆమోదించిన తీర్మానాల ఆధారంగా రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరముందని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.