Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి :
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
- మండుటెండలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా
- అదనపు కలెక్టర్కు దరఖాస్తులు, మెమోరాండం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇంటి స్థలానికి పట్టాలు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వందలాది మంది పేదలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలోని కేఎస్ఎం బంక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు దరఖాస్తులు, వినతిపత్రాలు అందజేశారు. ఈ ర్యాలీ, ధర్నాకు జిల్లా వ్యాప్తంగా నిరుపేదలు వందల సంఖ్యలో మండుటెండలో చంటి పిల్లలతో సహా తరలివచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదలకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పేదలు ఎండకు ఎండి, వానలకు తడిసి, చలిలో కూడా.. విష పురుగుల మధ్య జీవనం సాగిస్తున్నారని, మంచినీరు, కరెంట్ లేకపోయినా ఇంటి స్థలం కోసం అనేక బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో వివిధ రకాల కూలి పనుల కోసం అనేక మండలాల నుంచి వచ్చిన పేదలు ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
చుంచుపల్లి మండలంలో సర్వే నెంబర్ 137/1.. 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో 500 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, ఇల్లందు మండలం బాలాజీ నగర్లో సర్వే నెంబర్ 506లో 30 గుడిసెలు, సీఎస్పీ బస్తీలో సర్వే నెంబర్ 627లో 200 గుడిసెలు, సుజాత నగర్ మండలంలో పాత అంజనాపురం గ్రామంలో 200 గుడిసెలు, రాఘవాపురం గ్రామంలో 40 గుడిసెలు, కాసాని లక్ష్మినగర్లో 40 గుడిసెలు, పాల్వంచ మండలంలో సర్వే నెంబర్ 444 పాలకోయతండా ప్రియదర్శిని కాలనీల్లో 130 కుటుంబాలు నివసిస్తున్నారని తెలిపారు. వీరందరికీ వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శెట్టి వినోద, జిల్లా ఉపాధ్యక్షులు ఆలేటి కిరణ్, జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, భూక్య రమేష్, సందకూరి లక్ష్మి, గండమాల భాస్కర్, సోలం నాగరత్నం, కోటా బాలకృష్ణ, జబ్బ సంధ్యారాణి, భారతమ్మ, ప్రేమ్ కుమార్, సిద్దెల రాములు, లలిత తదితరులు పాల్గొన్నారు.