Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనం పెంచాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
సమస్యలు పరిష్కరించాలని.. వేతనాలు పెంచాలని, తమను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ) ఆధ్వర్యంలో వీఓఏలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లారు. క్షేత్రస్థాయిలో రోజంతా కష్టపడి పనిచేస్తున్న తమకు రూ.3900 వేతనం ఇవ్వటం దారుణమని, దీంతో కుటుంబం ఎలా గడుస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 20 ఏండ్ల నుంచి గొడ్డు చాకిరీ చేస్తున్న తమను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్, వీఓఏల సంఘం జిల్లా కార్యదర్శి సిరిశెట్టి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించారు. కౌటాల, పెంచికల్పేట్ మండల కేంద్రాల్లోనూ వీఓఏలు సమ్మెలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట.. వీఓఏలు దర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నటరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి డీఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఏపీడీ చరణ్‌దాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఐకేపీ వీఓఏలు నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ కేంద్రంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారాబోయిన శ్రీనివాస్ ప్రారంభించారు. డిండి మండలంలో నిర్వహించిన వీఓఏల సమ్మెలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కేతావత్ శరత్ కుమార్ పాల్గొన్నారు. మర్రిగూడలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. నాంపల్లిలో తహసిల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో కూర్చున్నారు. దామరచర్ల, చండూరులో సమ్మె నిర్వహించారు.
ఐకేపీ, వీవోఏల సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట ఐకేపీ విఓఏ ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. జడ్చర్ల మండల కేంద్రంలో సమ్మె చేశారు.
ఐకేపీ వీవోఏలను సేర్ప్ ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం ఆగదని సంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యదర్శి జి.సాయిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంగారెడ్డి డీఆర్డీఏ ఆఫీసు ఎదుట వీవోఏలు సమ్మె చేశారు. తూప్రాన్ మండల కేంద్రంలో వీవోఏల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.