Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరేగాకు కేంద్రం తూట్లు..పేదోళ్లకు పాట్లు
- రాష్ట్రంలో జాబుకార్డుల తొలగింపు ఐదు లక్షలకుపైనే
- 100 రోజుల పనికాదు.. 44.5 రోజులే
- ఈ ఏడాది 17.3 లక్షల మంది పనులకు దూరం
- ఒక్క జాబ్‌కార్డుపై ఏడాది సగటు ఆదాయం రూ. 7,308
- 2020-21లో ఆ ఆదాయం రూ.8,606
- ఈ ఏడాది తెలంగాణ కూలీలు నష్టపోయింది రూ.678.62 కోట్లు
ఉపాధి కూలీల గొంతుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఉపాధి హామీ చట్టానికి ఏటేటా నిధుల తగ్గింపు, ఆధార్‌తో అనుసంధానం, వేతనాలు సకాలంలో ఇవ్వకపోవడం, సౌకర్యాలు కల్పనలో తీవ్ర జాప్యం వంటి చర్యలకు పాల్పడుతూ కూలీలకు పొమ్మనకుండానే పొగపెడుతున్నది. వారు పట్టణాలకు వలసలు పోయేలా చేసి లేబర్ ఆర్మీని సృష్టిస్తున్నది. తక్కువ వేతనాలతో కూలీలు పనులు చేసేలా చేసి కార్పొరేట్లకు లాభాలు గడించి పెడుతున్నది. తాజాగా తెలంగాణలో ఉపాధి హామీ చట్టం అమలు తీరుపై లిబ్టెక్ సంస్థ వెల్లడించిన నివేదిక కూడా ఇదే సత్యాన్ని ఘోషిస్తున్నది. ఈ ఏడాది ఐదు లక్షలకుపైగా జాబ్‌కార్డుల తొలగించబడ్డాయి. కూలీలు రూ.678.62 కోట్ల రూపాయలను కోల్పోయారు. దీనిని బట్టే చట్టం ఎలా నిర్వీర్యం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వామపక్షాల ఒత్తిడితో యూపీఎ-1 ప్రభుత్వం అనివార్యంగా గ్రామీణ పేద ప్రజలకు ఆర్థిక, సామాజిక స్వావలంబన కలిగించేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ వ్యవస్థలోని ఆర్థిక వ్యత్యాసాల్లో కొంతలో కొంతైనా తగ్గించడానికి ఇది ఎంతో దోహదపడింది. వ్యవసాయ పనులు లేని కాలంలో పేదోళ్లకు కొండంత అండగా నిలిచింది. ఇది జగమెరిగిన సత్యం. కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పోతున్నది. తెలంగాణపై మరీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. మన రాష్ట్రంలో 52.8 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఈ ఏడాది ఐదు లక్షలకుపైగా జాబ్ కార్డులు(8.2 శాతం)తొలగింపబడ్డాయి. ఉపాధి హామీ చట్టం మొదలైనప్పటి నుంచి కార్డులను ఇంత పెద్ద సంఖ్యలో తొలగించడం ఇదే తొలిసారి. 2018-19లో 16వేల కార్డుల తొలగింపే ఇప్పటిదాకా అత్యధికం. ఈ ఏడాది తొలగించిన కార్మికుల సంఖ్య కూడా ఎక్కువే. 17.3 లక్షల మంది కార్మికులను పనులకు దూరం చేసింది. అదే సమయంలో పని కావాలంటూ కొత్తగా చేరింది 1.8 లక్షల మంది కార్మికులే. యావరేజీగా 14.8 శాతం కూలీలు పనులకు దూరం అయ్యారు. జాతీయ సగటు 13.2 శాతం మాత్రమే. ఈ తొలగింపు జాతీయ సమస్యగా ముందుకొచ్చింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక కూలీలు, జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యల్పంగా పనులకు దూరం అయ్యారు. ఏప్రిల్ 2022 మార్చి 2023 వరకు చూస్తే అన్ని నెలల్లో ఒకలా పనులు దొరకలేదు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్లో కాకుండా మిగతా రోజుల్లోనే పనులకు వెళ్లటం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తున్నది. 2022 మే లో అత్యధికంగా కూలీలకు 432.03 లక్షల పనిదినాలు కల్పించారు. జనవరిలో అతితక్కువగా 12.63 లక్షల పనిదినాలే దక్కాయి. వంద రోజుల పని ఎక్కువ పూర్తి చేసిన జిల్లా సంగారెడ్డి. తక్కువ కుటుంబాలకు వంద రోజుల పని దొరికింది కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా కూలీలకు 44.54 రోజుల పనిదినాలు మాత్రమే దొరికాయి. 2022-23లో 100 రోజులు పని పూర్తి చేసిన కుటుంబాలు జాతీయస్థాయిలో 16.7 శాతంగా ఉంటే..రాష్ట్ర స్థాయిలో 19.1 శాతం ఉంది. ఇది ఒక రకంగా రికార్డు. అయితే, 2020-21తో పోలిస్తే 2022-23లో జాబ్‌కార్డులకు పనిదినాల కల్పన భారీగా తగ్గింది. 2020-21లో మహిళలు 19.18 కోట్ల పనిదినాలు(మొత్తం పనిదినాల్లో 58.1 శాతం) పూర్తి చేస్తే...ఈ ఏడాది 2022-23కి చూసుకుంటే 59.2 శాతానికి పెరిగింది. పురుషుల సంఖ్య తగ్గింది. నరేగాలో మహిళల క్రియాశీల పాత్ర పెరుగుతున్నది. కారణమేమిటని విశ్లేషిస్తే అరకొరగా పనులు లభించడం, నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెట్టడం వంటి అంశాలతో పురుషులు క్రమంగా 'ఉపాధి'కి దూరమై వేరే పనులు వెతుక్కుంటున్నారు.
ఈ ఏడాది కూలీలు నష్టపోయింది రూ.678.62 కోట్లపైనే
2020-21లో ఉపాధి హామీ చట్టం ద్వారా ఒక జాబ్‌కార్డుపై కుటుంబానికి సగటున రూ.8,606 లభించింది. 2022-23కి వచ్చే సరికి ఆ ఆదాయం రూ.7,308కి పడిపోయింది. అంటే రెండేండ్లలో సగటు ఆదాయం 1298 రూపాయలు తగ్గింది. 2021-22లో 31.11 లక్షల జాబ్ కార్డుల ద్వారా కూలీలు పని చేయగా..2022-23కి ఆ సంఖ్య 27.35 లక్షలకు పడిపోయింది. 2020-21లో ఒక కుటుంబం సగటున 50.77 రోజుల పనిని పొందింతే..ఈ ఏడాది అది 44.54 రోజులకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు 237 వేతనం నిర్ణయించగా...సగటున రూ.169.51 కూలి దక్కింది. 2022-23కి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం రూ.257గా నిర్ణయించింది. కూలీలకు సగటున దక్కిందేమో రూ.164.33 మాత్రమే. రోజువారీ వేతనాన్ని రూ.20 పెంచినట్టు కేంద్రం గొప్పలకు పోతున్నప్పటికీ వాస్తవంగా కూలీలకు దక్కుతున్నది మాత్రం ఏటేటా పడిపోతున్నది. రెండేండ్ల కిందటితో పోల్చి చూసినా సగటు వేతనం ఐదు రూపాయలు తగ్గటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి ఏటేటా నిధులు తగ్గిస్తూ పోవటం వల్ల కూలీల కోసం ఇచ్చే వేతనాలూ తగ్గుతున్నాయి. 2020-21లో కూలీలు మొత్తం రూ.2,677.46 కోట్లు పొందగా ఆ మొత్తం ఈ ఏడాది వచ్చేసరికి రూ.1998.84 కోట్లకు తగ్గింది. అంటే ఈ ఏడాది తెలంగాణ కూలీలు నష్టపోయింది అక్షరాలా..678.62 కోట్ల రూపాయలు. జాబ్‌కార్డులు, వర్కర్ల తొలగింపు, ఆధార్ అనుసంధానం వంటి అంశాలు ఉపాధి కూలీలపై చాలా ప్రభావం చూపాయి. వేతనాలు సకాలంలో అందక కొందరు పనులకు వెళ్లటం మానేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నష్టపోతున్నది ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ
పనిదినాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా షెడ్యూల్డ్ తెగలే ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 2020-21లో 320.64 లక్షల వ్యక్తిగత పనిదినాలు లభించగా..ఆ సంఖ్య ఈ ఏడాదికి 245.02 లక్షలకు తగ్గింది. అంటే 18.7 శాతం పనిదినాలు తగ్గాయి. ఎస్సీలు 2020-21లో 356.97 లక్షల వ్యక్తిగత పనిదినాలు పొందగా..2022-23కి వచ్చేసరికి ఆ సంఖ్య 265.69 లక్షల వ్యక్తిగత పనిదినాలకు పడిపోయింది. సగటున 17.5 పనిదినాలు తగ్గాయి.
ఆధార్ అనుసంధానంతో ఆగమాగం
జనవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చింది. ఇందులో నమోదుకు మార్చి 31కి డెడ్‌లైన్ పెట్టింది. దీనివల్ల 9.2 శాతం కూలీలు ఉపాధి హామీ పనులకు అనర్హులయ్యారు. ఇప్పటిదాకా 59.5 లక్షల మంది యాక్టివ్ వర్కర్లుఉండగా 54 లక్షల మందే ఆధార్ లింకు చేసుకున్నారు. 1.05 కోట్ల రిజష్టర్ వర్కర్ల ఆధారంగా చూస్తే 42.8 లక్షల మంది (40.8 శాతం) అర్హత కోల్పోతున్నారు. జిల్లాల వారీగా అనర్హత పొందిన వారిలో ములుగు, రంగారెడ్డి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి.