Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీకి విద్యాశాఖ కార్యదర్శి హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీల కేసుకు సంబంధించి ముందస్తు విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను సోమవారం హైదరాబాద్లో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, బి రామకృష్ణ కలిసి పదోన్నతులు, బదిలీల కోర్టు కేస్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మౌఖిక ప్రాతినిథ్యం చేస్తూ స్టేను వెకేట్ చేయించడంలో ప్రభుత్వ పక్షాన ప్రయత్నం చేయాలని, ఇంకా కోర్టులో ప్రభుత్వ వాదనలు సమర్థవంతంగా చేసేటట్టు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వేళ ఇంకా తీర్పులో జాప్యమైతే కనీసం పదోన్నతులు ఇవ్వడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వారు సూచించారు. దానికి విద్యాశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ముందస్తు విచారణ కోసం హైకోర్టులో అప్పీల్ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మేరకు ముసాయిదా పత్రం కూడా సిద్ధం చేశామన్నారని తెలిపారు.
ఇంకా వివిధ అప్పీళ్ల గురించి తాము ప్రస్తావించగా, ఆశా వహుల పరస్పర బదిలీలు, పదోన్నతులు ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తయ్యాకే చేస్తామన్నారని వివరించారు. మోడల్ స్కూళ్ల కామన్ సీనియార్టీని వారు విధుల్లో చేరిన తేదీని బట్టి నిర్ణయిస్తామని, కేజీబీవీలలో పనిచేస్తున్న పీఈటీల వేతనాలను మిగతా సీఅర్టీల వేతనాలతో సమానంగా వేసవి సెలవుల్లో పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు.