Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2,876లో 2,300 కొలువులు వారికే
- జనరల్ కోటాలో 576 పోస్టులు
- గురుకుల జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ షురూ తుదిగడువు మే 17
- ఆగస్టులో రాతపరీక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం గురుకుల విద్యాలయాల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్ విభాగాల్లో 2,876 పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వాటిలో మహిళలకే పెద్దపీట వేసింది. మొత్తం గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రకటించిన 2,876 కొలువుల్లో వారికే 2,300 (80 శాతం) పోస్టులు కేటాయించడం గమనార్హం. జనరల్ కోటాలో కేవలం 576 (20 శాతం) పోస్టులే ఉన్నాయి. 2008 జేఎల్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో మహిళలకే 1,540 కొలువులున్నాయి. అంటే జనరల్ కోటాలో 108 మాత్రమే ఉన్నాయి. 868 డీఎల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో 760 పోస్టులు మహిళలకే ఉన్నాయి. ఇందులో జనరల్ కోటాలో 108 పోస్టులున్నాయి.
ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. వాటి సమర్పణకు తుదిగడువు వచ్చేనెల 17వ తేదీ వరకు ఉన్నది. ఆగస్టులో రాతపరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ప్రణాళిక రూపొందించింది. ఆ పరీక్షల వివరాలను వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు వివరించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్టికెట్లను పరీక్షల నిర్వహణకు వారం రోజుల ముందు వెబ్సైట్ అందుబాటులో ఉంచనున్నట్టు బోర్డు వెల్లడించింది. అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)ను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నియామక బోర్డు ఈనెల 12 నుంచే ఓటీఆర్ను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే గురుకుల విద్యాలయాల్లో 9,231 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 2,876 పోస్టుల భర్తీకి మరో రెండు నోటిఫికేషన్లను పూర్తిస్థాయి వివరాలతో విడుదల చేసింది. ఇక మిగతా 6,355 పోస్టులకు ఈ నెల 24, 28 తేదీల్లో మరో నోటిఫికేషన్ విడుదల కానుంది.