Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్
నవతెలంగాణ-కాప్రా
హీమోఫిలియో వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ హీమోఫిలియో దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కాప్రాలో ఎన్పీఆర్డీ అధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ 19 హీమోఫిలియోతో బాధపడే వారికి అనేక సమస్యలు తెచ్చిపెట్టిందన్నారు. హీమోఫిలియోతో బాధపడే వారికి చిన్న గాయం అయినా రక్తం గడ్డకట్టకపోవడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగి మరణించే ప్రమాదం ఉందన్నారు. హీమోఫిలియో-ఏ ప్రతి 10,000 మందిలో ఒక్కరికి, హీమోఫిలియో-బీ ప్రతి 20,000 మందిలో ఒక్కరికి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. హీమోఫిలియో-ఏ కంటే హీమోఫిలియో-బీ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. స్త్రీల కంటే పురుషులలో ఇది ఎక్కువగా ఉంటుందన్నారు.
దేశంలో హీమోఫిలియో ఉన్న వారికి ఆరోగ్య సంరక్షణ అందించడంలో కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. హీమోఫిలియో రోగ నిర్ధారణ, చికిత్సకు మన దేశంలో అవసరమైన పరికరాలు అందుబాటులో లేవన్నారు. కావునా ఈ వ్యాధి చికిత్స కోసం అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ముందస్తు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణతోపాటు మిగతా రాష్ట్రాల్లో ఉచితంగానే చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, మోతి బాయి, చందు లాల్, మంగియా పాల్గొన్నారు.