Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్భవన్ ఇఫ్తార్‌లో చంద్రబాబు
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సోమ వారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానం మేరకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎప్పుడు చూసినా మత ఘర్షణలతో కర్ఫ్యూ వాతావరణంతో ఉండే హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని నెలకొల్పిన ఘనత టీడీపీకే దక్కిందని ఆయన అన్నారు. కర్ఫ్యూ సిటీని వ్యాక్సిన్ కేంద్రంగా మార్చేశామని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనకు ముందు, తరువాత హైదరాబాద్‌ను చూడాలని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం హయాంలో 14 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా అమలు చేసినట్టు గుర్తు చేశారు. అంతకుమునుపు హజ్ యాత్రకు ముస్లింలు వెళ్లాలంటే ముంబయి వెళ్లాల్సి వచ్చేదనీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌజ్‌ను నిర్మించి ఇక్కడి నుంచే వెళ్లటానికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంటు అథారిటీని ఏర్పాటు చేశామనీ, ముస్లింలకు రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, దుకాన్ మకాన్లు పెట్టడం, షాదీఖానాలు ఏర్పాటు చేయటం, మసీదులకు ఆర్థిక సహాయం వంటివి చేసినట్టు చెప్పారు.
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో మంచి పనులు చేసినవారికి అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలతో ముస్లింలు పవిత్రలవుతున్నారని ఆయన అన్నారు. క్రమశిక్షణ, ధాతత్వం, ధార్మికతల కలయికగా రంజాన్ మాసం నిర్వహించుకుంటామని చెప్పారు.ఈ కార్య క్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, రాష్ట్ర పార్టీ సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహన్ రావు, జాతీయ కమిటీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న, ఉపాధ్యక్షులు అలీ మస్కతీ, వాసిరెడ్డి రామ నాథం, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు కనగల సాంబశివరావు, రవీంద్ర చారి, కార్యదర్శిలు షేక్‌బాబా ఖాదర్, సాయితులసి, తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరామ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపి, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రవీందర్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు కాసాని వీరేశ్, ఆరీఫ్, అజ్మీర రాజునాయక్, బండారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.