Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మహాసభకు అభినందనలు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-నాచారం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ ప్రాంగణం నామకరణంతో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మహాసభ జనగామలో జరుపుకోవడం అభినందనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని నెమరు వేసుకోవడం మంచి విషయమన్నారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ వాల్ పోస్టర్ను సోమవారం హైదరాబాద్ హబ్సిగూడలోని ఓ ప్రయివేటు కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆధునీకరణ ఉపాధి కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసినట్టు తెలిపారు. వృత్తిదారులకు సబ్సిడీలు అందజేసి బతుకు భరోసా కల్పించారని చెప్పారు. ఉద్యమాల ఖిల్లా జనగామ జిల్లాలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ ఈనెల 29, 30 తేదీల్లో జరుపుకోవడం అభినందనీయమన్నారు. మహాసభ విజయవంతం కోసం తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం నిర్వహిస్తూ అనేక విజయాలు సాధించిన రజక వృత్తిదారుల సంఘానికి ప్రజలు అండగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, అధ్యక్షులు నరేష్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి ఉపేందర్, నాయకులు మదర్, ఐలయ్య, రంగన్న, రమేష్ పాల్గొన్నారు.