Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న చలో హైదరాబాద్ : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు ప్రకటించారు. ఆ రోజు లేబర్ కమిషనరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హమాలీల చలో హైదరాబాద్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోపాలస్వామి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కార్యదర్శులు రాగుల రమేష్, ముత్యంరావు, బలరామ్, విఠల్, రాజయ్య, తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..భవన నిర్మాణ కార్మికులకు మాదిరిగానే హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ గోదాముల్లో పని చేస్తున్న సివిల్ సప్లరు, జీసీసీ, బేవరేజెస్, ఎఫ్‌సీఐ హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐఎల్ఓ తీర్మానం ప్రకారం 50 కేజీల బరువులను నిషేధించాలన్నారు. హమాలీలందరికీ ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కుల కల్పించాలని కోరారు. ఐకేపీ హమాలీలకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు పైబడిన హమాలీలకు నెలకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.