Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం 1,550 బస్సులు
- తొలివిడతలో హైదరాబాద్-విజయవాడ మధ్య 50 బస్సులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలోకి గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో దశల వారీగా 1,550 ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వీటిలో తొలివిడతగా మే నెలలో 50 ఎలక్ట్రిక్ బస్సుల్ని హైదరాబాద్-విజయవాడ మధ్య నడుపుతామని చెప్పారు. సోమవారంనాడాయన బస్‌భవన్‌లో కొత్త ఎలక్ట్రిక్ ఏసీ నమూనా బస్సును పరిశీలించారు. బస్సు లోపల కొన్ని మార్పులు చేయాలని నిర్మాణ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. సౌకర్యాల విషయంలో రాజీ పడబోమన్నారు. ఈ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేల్యాండ్, జీబీఎం సంస్థల నుంచి మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్టు సజ్జనార్ తెలిపారు. 12 మీటర్ల పొడవుండే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో 41 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. ప్రతి బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో నెలరోజుల వరకు రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా బస్సుల్లో ఉంటుంది. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్‌కుమార్, మునిశేఖర్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం) జీవన్ ప్రసాద్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఏజీఎంలు వేణుగోపాల్‌రావు, ఆనంద్ బసోలి తదితరులు పాల్గొన్నారు.