Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నం
- ప్రధాన నిందితుడు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి
- ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోలీసులు
- భూ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం
- జాతీయ రహదారిపై కుటుంబీకులు, కాంగ్రెస్ నాయకుల ధర్నా
- కేసు వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కుషాల్కర్
నవతెలంగాణ-కొత్తూరు
యువకుడిని కిడ్నాప్ చేసి, దారుణంగా చావబాది హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డితో పాటు పలువురు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ కుషాల్కర్, సీఐ బాలరాజు సోమవారం మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి (29) కొత్తూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొంతకాలంగా కొత్తూరు ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డికి, ఇతని మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. గతంలో మృతుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆ సమయంలో ఎంపీపీ చేసిన భూ అక్రమాలు, ఆర్థిక లావాదేవీలు మృతునికి పూర్తిస్థాయిలో తెలియడంతో అవి ఎక్కడ బయటపడతాయోననే నేపంతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం చికెన్ తీసుకురావడానికి తన మామ శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో కరుణాకర్‌రెడ్డి బయలుదేరారు. శ్రీధర్ రెడ్డి తన బంధువును మామిడిపల్లిలో దించి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా తీగాపూర్ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద నిందితులు పిన్నింటి విక్రం రెడ్డి, పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డి, అరిఫ్, చిట్టేడి అరుణ్ కుమార్ రెడ్డి స్కార్పియో వాహనంతో వీరిని అడ్డుకున్నారు. నిందితులు.. శ్రీధర్‌రెడ్డిని కొట్టి ఎవరికైనా చెప్తే 'నిన్ను చంపేస్తాం' అంటూ బెదిరించి అతని ఫోన్‌ను బద్దలు కొట్టారు. అనంతరం కరుణాకర్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకొని తమ వాహనంలో ఎక్కించుకొని చేగురు వైపు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అతన్ని తీవ్రంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. అనంతరం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి.. శంషాబాద్ వద్ద ప్రమాదం జరిగిందంటూ ఎమర్జెన్సీ వార్డులో కరుణాకర్‌రెడ్డిని అడ్మిట్ చేసి, పరారయ్యారు. కాగా, రాత్రి 10 గంటల సమయంలో కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి పోలీసులకు ఫోన్ రాగా.. వారు శవాన్ని చూసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహం కరుణాకర్ రెడ్డిదేనని అతని బంధువులు ధృవీకరించారు. హాస్పటల్ సీసీఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ చేసిన వ్యక్తులే అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తమ కుమారుని మృతి వార్త తెలుసుకున్న ఆ కన్నతల్లి గుండె బరువైంది. ఆమె తెల్లవార్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట రోధిస్తూ కూర్చుంది. కనిపించిన ప్రతి ఒక్కరిని కాళ్లు పట్టుకొని తనకు న్యాయం చేయాలని, తన కొడుకును చంపిన వారిని జైలుకు పంపి తగిన శిక్ష పడేలా చేయాలని రోధిస్తుండటంతో అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఆమెతో పాటు మల్లాపూర్ గ్రామస్తులూ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని నిందితులను అరెస్టు చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్తూరు పాత జాతీయ రహదారిపై మృతుని తల్లితో కలిసి ధర్నా చేపట్టారు. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.