Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంచల్‌గూడ జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌లను విచారించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చంచల్‌గూడ జైలులో విచారించారు. ఈ ఇద్దరిని రెండ్రోజుల పాటు చంచల్‌గూడ జైలులో విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో నలుగురు అధికారులతో కూడిన దర్యాప్తు బృందం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చంచల్‌గూడ జైలుకు చేరుకొని విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు నిందితులను విచారించడానికి చంచల్ గూడ జైలులోనే ప్రత్యేక గదిని జైలు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.40 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. టీఎస్పీఎస్సీ చైర్మెన్ పీఏ అయిన ప్రవీణ్ కుమార్‌ను, ఇదే విభాగంలో కంప్యూటర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన రాజశేఖర్‌రెడ్డిలను మొదట వేర్వేరుగా, తర్వాత కొద్ది సేపు ఇద్దరిని కలిపి ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాన్ని కంప్యూటర్ నుంచి తస్కరించడానికి ఈ ఇద్దరు అనుసరించిన మార్గాల పైనే ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించి ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా, ఉన్నతాధికారులు అత్యంత రహస్యంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన ఈ ప్రశ్నాపత్రాలను మూడో కంటికి తెలియకుండా సెక్యూరిటీ పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేస్తారనీ, అటువంటి సెక్యూరిటీ పాస్వర్డ్లు మీ చేతికి ఎలా వచ్చిందని ఇద్దరు నిందితులను ఈడీ అధికారులు నిలదీసినట్టు సమాచారం. ఇందుకు తెర వెనక ఎవరైనా ఉన్నతాధికారి సహకరించారా? లేక యుక్తిగా మీరే పాస్‌వర్డ్‌ను సాధించారా? అనే కోణంలో ప్రవీణ్, రాజశేఖర్‌లను ఈడీ అధికారులు గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. చేతికి చిక్కిన ప్రశ్నాపత్రాన్ని ఎంత మందికి లీక్ చేశారు? తద్వారా ఒక్కొక్కరి నుంచి తీసుకున్న సొమ్మెంత?, మూకుమ్మడిగా విక్రయించారా? లేదా వేర్వేరుగా విక్రయించారా? ఇందులో విదేశీ అభ్యర్థులకు ఎంత మందికి విక్రయించారు? తదితర కోణంలో అధికారులు ప్రశ్నలను సంధించారని సమాచారం. అలాగే, విదేశీ అభ్యర్థుల నుంచి ఏ మార్గాన వీరి చేతికి భారీ మొత్తంలో డబ్బులు చేరాయి? అని కూడా ఈడీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఈ ఇద్దరు నిందితులను విచారించనున్నట్టు సమాచారం.