Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20ఏండ్లుగా సేవలందిస్తున్నా పెరగని జీతం
- పెరిగిన పని ఒత్తిడి.. భారంగా కుటుంబ పోషణ
- సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి దోహదం చేస్తున్న ఐకేపీ వీఓఏల పరిస్థితి దయనీయంగా మారింది. ఆయా సంఘాలకు రుణాలు ఇప్పించడం, తిరిగి వాటిని రికవరీ చేయడం, పింఛన్లు అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్దిదారులకు చేర్చడంలో వీరిదే కీలకపాత్ర. ఆయా సంఘాల ఆర్థిక లావాదేవీలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. వీరికి ఈ పని తప్పితే మరో పని చేయడం వీలుకాని పరిస్థితి. ఎప్పటికైనా సెర్ప్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తిస్తుందనే నమ్మకంతో పనిచేస్తున్నారు. నెలకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.3900తోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో వచ్చే జీతంతో కనీసం సరుకులు కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు.
గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ స్వయం సహాయక సేవకులు ప్రభుత్వం అం దించే అరకొర వేతనంతో జీవనం సాగిస్తూ ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. వచ్చే వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో మనో వేదనకు గురవుతున్నారు. 20 ఏండ్లుగా గ్రామాల్లో సేవలందిస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు కేవలం రూ.3900 చెల్లించడంతో ఈ వేతనం ఎటూ సరిపోవడం లేదని చెబుతున్నారు. సెర్ప్ ఉద్యో గులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు అందిం చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాటపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు కొనసాగిస్తామని ఆ సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు.
విధులు బహిష్కరించి సమ్మెబాట
దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు సోమవారం నుంచి సమ్మెబాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 500మంది వీఓఏలు పనిచేయగా ఉమ్మడి జిల్లాలో 2వేలకు పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధులు బహిష్క రించి మండలాల్లో నిరసన చేపట్టారు. తమను సెర్ప్ ఉద్యో గులుగా గుర్తించి రూ.10లక్షల సాధారణ, ఆరోగ్య బీమా కల్పించాలని, గుర్తింపు కార్డులు అందజేయాలని చెబుతున్నారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా వీఓఏ ఖాతాల్లో చెల్లించాలని, జాబ్చార్ట్్తో సంబంధం లేని ఆన్లైన్, ఇతర పనులను చేయించకూడదని స్పష్టం చేస్తున్నారు.అర్హులైన వీఓఏలకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి :
అనేక ఏండ్లుగా అరకొర వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న ఐకేపీ వీఓఏ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలి. సెర్ప్ ఉద్యో గులుగా గుర్తించడంతో పాటు రూ.26వేల వేతనం అందించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా ఉండి పోరాడుతాం.
- అన్నమోల్ల కిరణ్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
కుటుంబ పోషణ భారంగా మారుతోంది
తమకు ప్రభుత్వం కేవలం రూ.3900 వేతనంగా అందజేస్తోంది. ఈ జీతంలో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇందులో పని ఒత్తిడి కారణంగా ఇతర పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి రూ.26వేల వేతనం అందించాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తాం.
- కె.రాజేష్, ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షులు.