Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014లోనే ప్రధాని హామీ ఇచ్చారు
- అప్పర్ భద్రకు ఎలా అనుమతులు ఇచ్చారు
- తెలంగాణకు ఒక న్యాయం.. కర్నాటకకు మరో న్యాయమా ? : కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తచేసింది. కేటాయింపులకు లోబడే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపడితే అనుమతులు ఇవ్వడం లేదనీ, కనీసం డీపీఆర్‌ను పరిశీలించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కర్నాటకలోని అప్పర్‌భద్రకు మాత్రం అనుమతులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా కూడా కల్పించిందని గుర్తు చేసింది. తెలంగాణకు ఒక న్యాయం, ఇతర రాష్ట్రాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించింది. 2014 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని అడిగింది.
ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కేటాయింపులకు లోబడే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని స్పష్టం చేసింది. పోలవరం నుంచి కష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న ర్రాష్టాలు 80 టీఎంసీల కష్ణా జలాలు వాడుకోవచ్చని గోదావరి ట్రిటైబ్యునల్ ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. ఈ మేరకు వచ్చే 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్లో మిగిలిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో పాజెక్టును చేపట్టామని అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ డీపీఆర్ వెనక్కి పంపించడంలో కేంద్రం అంతర్యం ఏమిటని ప్రశ్నించింది. కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో చేపట్టారని వ్యాఖ్యానించింది. మైనర్ ఇరిగేషన్లో మిగిలిన జలాలు, పోలవరం నుంచి కష్ణా డెల్టాకు తరలించిన వాటాలో వచ్చే జలాల ఆధారంగా అప్పర్ భద్రకు ప్రతిపాదించారని పేర్కొన్నారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా ఏకంగా జాతీయ హౌదా కల్పించి, కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా విడుదల చేసిందని పేర్కొన్నారు. కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో 1200 గ్రామాలకు, 6 జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు తాగునీరు, సాగునీరు అందించడానికి ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డికి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఒక్కో ర్రాష్టానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.
డీపీఆర్‌ను పరిశీలించాల్సిందే..
2021 జూలై 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం.. అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు-రంగారెడ్డిని చేర్చారనీ, ఆరు నెలల్లోగా అనుమతు లు పొందాలని చెప్పారన్నారు. ఈ మేరకే అనుమతుల కోసం డీపీఆర్‌ను సమర్పించినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా డీపీఆర్‌ను పరిశీలించి, అనుమతులు ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. కాగా ట్రిబ్యునల్‌లో కేసు విచారణ కొనసాగు తున్నదనే కారణంతో డీపీఆర్‌ను పరిశీలించలేమని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చెప్పడం అన్యాయ మన్నారు. తమకు నీటి కేటాయింపులు చేసే అధికారం లేదని జస్టిస్ బ్రిజేష్ కుమార్ చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి డీపీఆర్‌ను పరిశీలించి, ట్రిబ్యునల్ తుది తీర్పునకు లోబడి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్ర జలసంఘాన్ని ఆదేశించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర సాగునీటి శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ లేఖ రాశారు. కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలు అన్నిటికీ సవివరమైన సమాధానాలు సమర్పించామని పేర్కొన్నారు.