Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ ఆఫీసు ఎదుట పేదలతో సీపీఐ(ఎం) ధర్నా
- పట్టాలు ఇచ్చేంతవరకూ పోరాటం ఆగదు : సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
జీవో 58 ప్రకారం గుడిసెవాసులందరికీ వ్యక్తిగత పట్టాలివ్వాలని హనుమకొండ తహసీల్దార్ ఆఫీసు ఎదుట వందలాది మంది పేదలతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి పాల్గొని మాట్లాడారు. పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిలువ నీడలేని పేదలు ఏడాదికాలంగా పెగడపల్లి రింగ్ రోడ్డు వద్ద పలివెల్పుల శివారు కోమటికుంట సర్వే నంబర్ 288లోని 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో 60 గజాల స్థలంలో గుడిసెలు వేసుకొని కనీస సౌకర్యాలు లేకపోయినా అక్కడే జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.
వీరందరికీ ప్రభుత్వం జీవో నెంబర్ 58 ప్రకారం వ్యక్తిగత పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఇండ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం కొని డబుల్ బెడ్రూమ్ ఇల్ల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన హామీని నిలుపుకోవాలని కోరారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి దేశంలో ఇల్లు లేని పేదలంటూ ఉండరని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి హామీలను నేటికీ అమలు చేయకపోవడంతో అద్దె ఇండ్లలో ఉండే పేదలు నానా అవస్థలు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమకొండ మహానగరంలో ప్రభుత్వ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని, ప్రభుత్వ భూములను రక్షించడం కోసమే ఇండ్లు లేని పేదలను సమీకరించి సీపీఐ(ఎం) గతేడాది నుంచి భూ పోరాటాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. గుడిసెవాసుల కనీస సౌకర్యాలైన కరెంటు, నీరు, మరుగుదొడ్లు, రోడ్లు లేకపోయినా అనేక ఇబ్బందులు పడుతూ అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు.
గుడిసెవాసుల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 58 జీవో ప్రకారం గుడిసె వాసులంతా అర్హులని వీరికి వ్యక్తిగత పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. లేనియెడల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గుమ్మడి రాజుల రాములు, మండల కమిటీ సభ్యులు పెండ్యాల రవి, నాయకులు సంపత్, ప్రభాకర్, రాజన్న, భాస్కర్, రవికుమార్, ఆనందం, ఎల్లన్న, అనిల్, చంద్రమౌళి, ప్రతాప్, లక్ష్మి, సరిత, లత, అనూష, వినోద, రాధా తదితరులు పాల్గొన్నారు.