Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వచ్చేనెల పది నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరిగే ప్రవేశ పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలిలో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. ప్రత్యేకంగా పర్యవేక్షకులను నియమించాలని ఆదేశించారు. పరీక్షల కన్వీనర్లు, వీసీలు, ఉన్నత విద్యామండలి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని కోరారు. గతేడాది ఎంసెట్‌కు 2,66,719 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 3,18,018 దరఖాస్తులొచ్చాయని వివరించారు. ప్రవేశ పరీక్షల విధులు నిర్వహించే సిబ్బందికి ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను అనుమతించొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వర్సిటీల వీసీలు, వివిధ సెట్ల కన్వీనర్లు పాల్గొన్నారు.
ఉన్నత విద్యామండలిపై మంత్రి ఆగ్రహం
ఎంసెట్ భద్రత చర్యలపై జేఎన్టీయూహెచ్ అధికారులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారం జరుగుతున్నా, భద్రతపై అధికారులు ఇప్పటికీ ఒక్క సమావేశాన్ని నిర్వహించకపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించినట్టు సమాచారం. గతంలో ఎంసెట్ కన్వీనర్‌గా ఉన్న గోవర్థన్ ఎప్పటికప్పుడు వివరాలు పారదర్శకంగా ఉంచేవారని, ప్రస్తుత కన్వీనర్ కొత్త కావడం వల్ల ఏమీ తెలియడం లేదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జేఎన్టీయూహెచ్ అధికారులు సహకరించడం లేదంటూ మంత్రి వద్ద లింబాద్రి ఈ సందర్భంగా వాపోయినట్టు సమాచారం.