Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారం కార్యాచరణను రూపొందించాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-హైదరాబాద్
నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈమేరకు హరితహారం కార్యాచరణను రూపొందించాలని సూచించారు. హరిత హారం సన్నాహలు, ఏర్పాట్లపై సంబంధిత శాఖలు, ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు నీటి పారుదల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటాలని సూచించారు. చక్కటి పచ్చదనం పెంపుతో పాటు, సమీప గ్రామాల ప్రజలకు స్వచ్చమైన ఆక్సీజన్ ఫలసాయం అందేలా సంపద వనాలను సష్టించాలని సాగునీరు, పంచాయితీ రాజ్, అటవీశాఖ అధికారులను కోరారు. మూడు శాఖల క్షేత్రస్థాయి అధికారులతో జిల్లాల వారీగా ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి, స్థల పరిశీలన, స్థానికంగా అనుకూలతలు కలిగిన చెట్ల జాతులను గుర్తించాలనీ, మొక్కలు నాటిన తర్వాత వాటి రక్షణ చర్యలపై కూడా ముందస్తు ప్రణాళిక ఉండాలని సూచించారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర, కాలువల వెంట ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించటంతో పాటు, రక్షణ చర్యలు చేపట్టి, అన్ని కాలువల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న చోట బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు, రైతుల సహకారం కూడా తీసుకోవాలని తెలిపారు. ఒక సారి పెట్టిన మొక్కలు, మంచి ఎదుగుదలతో పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని అన్నారు. అటవీ భూముల్లో చేపట్టిన హరితవనాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పురోగతిని కూడా సమీక్షించారు. రానున్న సీజన్లో అన్ని హరితవనాల్లో టార్గెట్లు పూర్తి కావాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎం. హన్మంత రావు, స్పెషల్ కమీషనర్ వీ.ఎస్.ఎన్.వీ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.