Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా నిర్వహించుకోవాలి :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలను ఈ నెల 25న ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా కొనసాగుతు న్నాయన్నారు. మధుసూదనాచారి నేతృత్వంలోని కార్యక్రమాల అమలు కమిటీ ఆత్మీయ సమ్మేళనాల నివేదికను ఎప్పటికప్పుడు అధ్యక్షులు, సీఎం కేసీఆర్కు అందజేస్తున్నారని తెలిపారు. 25న నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతినిధుల సభలు పార్టీ అధిష్టానం నియమించిన ఇన్చార్జీలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన జరుగుతాయని చెప్పారు. ఆయా జిల్లాల అధ్యక్షులు ఆ సమావేశాల నిర్వహణను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గ కేంద్రంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో 25న ఉదయమే పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని సభాస్థలికి చేరుకోవాలన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల న్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కనీసం 3000 -3500 మంది ప్రతినిధులతో సభ నిర్వహించాలని నొక్కి చెప్పారు. పార్టీ గ్రామ, వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మెన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మెన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మెన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మెన్లు, ఇతర సీనియర్ నాయకులందరూ సమావేశాలకు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలను ఆదేశించారు.