Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణానదిలో అక్రమంగా కాంపౌండ్ వాల్
- మంత్రి ఫాంహౌజ్ రోడ్డుకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు : రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖ మంత్రి సి.నిరంజన్‌రెడ్డి కృష్ణానది ఒడ్డున 165 ఎకరాల్లో ఫామ్‌హౌజ్ కట్టి దాని చుట్టూ ప్రహరీ తిప్పారనీ, అందులో 85 ఎకరాలు ఆక్రమించిన భూమే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సీఎం కేసీఆర్‌కన్నా తక్కువనా అనుకున్నాడో ఏమోగానీ మూడు ఫామ్‌హౌజ్‌లను మంత్రి కట్టుకున్నారని విమర్శించారు. వాటి కోసం వ్యవసాయశాఖ ద్వారా వచ్చే రుణాలు, సబ్సిడీలన్నింటినీ బినామీల పేరుతో స్వాహా చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల పేరుమీదకు భూములను బదలాయించుకున్నారని విమర్శించారు. 165 ఎకరాల్లో 80 ఎకరాలు మాత్రమే రిజిస్టర్డ్ భూమి అని పత్రాలు చూపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని ఫొటోలను చూపారు. వాటిపై సీఎం కేసీఆర్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఫాంహౌజ్ కట్టుకున్న మానవపాడు మండలంలో 21అక్టోబర్ 2021న తహసీల్దార్ కార్యాలయం తగలబడిందని చెప్పారు. ఇప్పటివరకూ దానిపై చార్జిషీట్ నమోదుకాలేదన్నారు. పాత రికార్డులేవీ ఉండవు కాబట్టి మంత్రి యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు.