Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18నెలలుగా తీవ్ర కడుపునొప్పితో మహిళ వేదన
- ఆపరేషన్ చేసి తొలగించిన జగిత్యాల డాక్టర్లు
నవతెలంగాణ - జగిత్యాల టౌన్
జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 నెలల కిందట డెలివరీ కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు.. పొట్టలోనే కాటన్ గుడ్డ ఉంచి కుట్లు వేశారు. దాంతో ఏడాదిన్నరగా సదరు మహిళ నరకయాతనను అనుభవించింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బాలింత నవ్యశ్రీ డెలివరీ కోసం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలకొండలోని పుట్టింటికి రాగా, డెలివరీ కోసం జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో 29 డిసెంబర్ 2021న నవ్యశ్రీ అడ్మిట్ అయింది. ఈ క్రమంలో నవ్యశ్రీకి సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ తర్వాత కాటన్ గుడ్డను పొట్ట లోపలే మరిచిపోయి కుట్లు వేశారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నవ్యశ్రీ నెల రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపింది. రోజులు గడుస్తున్నా కొద్దీ బాధ ఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో వేములవాడలోని ప్రయివేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా పొట్టలో కాటన్ గుడ్డ ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి కాటన్ గుడ్డను తొలగించారు. ఈ విషయంపై జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.