Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహీంద్రా కంపెనీ గేట్ మీటింగ్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-జహీరాబాద్
మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమ చరిత్రను తిరగరాసి.. రిక్రూట్మెంట్ పాలసీని తీసుకువచ్చి.. 400కు పైచిలుకు జూనియర్ కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత సీఐటీయూకే దక్కుతుందని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా సీఐటీయూనే భారీ మెజార్టీతో గెలిపించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని స్థానిక పరిశ్రమ ఎదుట నిర్వహించిన గేట్ మీటింగ్కలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న సంఘం సీఐటీయూ అని, మహీంద్రాలో మరోసారి సీఐటీయూను గెలవడం ద్వారా మరిన్ని సౌకర్యాలు సాధించి పెడతామని హామీ ఇచ్చారు. ఇంతకుముందు పరిశ్రమలో సీఐటీయూను గెలిపించగా.. మంచి వేతన ఒప్పందంతో పాటు 450 మంది కార్మికులను పర్మినెంట్ చేయించామన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం, బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించామని తెలిపారు. కంపెనీ యజమాన్యం త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతుందని, అందుకు రూ.1000 కోట్ల నూతన ప్రాజెక్టు కూడా రానుందన్నారు. దాంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని చెప్పారు.
అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ.. పరిశ్రమలో 39 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఎంత జీతం వస్తుందో గతంలో ఉన్న యూనియన్లు ఏడు అగ్రిమెంట్లలో ఎంత సాధించారో కార్మికులు ఒకసారి బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2011లో కార్మికులు సీఐటీయూని గెలిపించడంతో నాటి నుంచి నేటి వరకు చేసిన అగ్రిమెంట్లలో ఒక్కో కార్మికునికి రూ.39,500 జీతం పెంచుకోగలిగామని తెలిపారు. జిల్లా కార్యదర్శి జి. సాయిలు మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఐక్యంగా సంసిద్ధం కావాలన్నారు. కంపెనీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడాల్సింది.. కొట్లాడాల్సింది, కార్మికుల చట్టాల పట్ల అవగాహన కలిగిన నాయకులు మాత్రమేనని అన్నారు. ఎన్నికల ముందు వచ్చి ఏమి చేస్తామో కార్మికులకు తెలపకుండా కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి అని ఇతర యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమన్నారు. మీటింగ్లో పరిశ్రమలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సాజీద్, కోటిరెడ్డి, నరేష్, ఉమా మహేశ్వరరావులతోపాటు పలువురు కార్మికులు మాట్లాడి తమ అనుభవాలను తెలిపారు. సమావేశంలో మహేంద్ర ట్రాక్టర్స్ ప్లాంట్ ప్రధాన కార్యదర్శి వంశీ, పిరమిల్ పరిశ్రమ కార్యదర్శి నరసయ్య, రాకుల్ పరిశ్రమ కార్యదర్శి నారాయణ, ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్యదర్శి నర్సింలు, సీఐటీయూ నాయకులు మహిపాల్, కనకా రెడ్డి, డీపీసీ శేఖర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.