Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
- పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆర్ఎల్ మూర్తి, నాగరాజు
నవతెలంగాణ - హైదరాబాద్
భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పర్యవేక్షణలో మోడల్ ఎంసెట్, నీట్ పరీక్ష ఈనెల 26 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు, హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, కె అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మూర్తి, నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ, పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత 18 ఏండ్ల నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 300 కేంద్రాలలో ఈ మోడల్ పరీక్షలు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ జరుగుతాయన్నారు. రాష్ట్రంలో అత్యంత నిష్ణాతులైన, అనుభవం ఉన్న ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను రూపొందించి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. కార్పొరేట్ కాలేజీలు ఎంసెట్, నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో ఏడాదికి లక్షల రూపాయలు దండుకుంటున్నాయని విమర్శించారు. పేద విద్యార్థులకు అలాంటి అవకాశం లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసమే మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది రాయడం వల్ల మెళకువలు తెలుస్తాయని, సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుందని వివరించారు. ఈ పరీక్షల్లో విజయం సాధించిన టాప్ పది మంది విద్యార్థులకు బంగారు పతకాలను బహుకరిస్తామని చెప్పారు. విద్యార్థుల తరుపున పోరాటాలే కాకుండా, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎస్ఎఫ్ఐ ఈ తరహా మోడల్ పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలకు 9490098292, 8247672658 (హైదరాబాద్-9030881429, 95151 66907) (రంగారెడ్డి-9701883081) (మేడ్చల్- 9618604620) నెంబర్లను సంప్రదిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా నాయకులు స్టాలిన్, శివ, వాసు తదితరులు పాల్గొన్నారు.