Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైకోర్టులో స్టే పేరుతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై తాత్సారం మంచిది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై విద్యాశాఖ తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. గతేడాది మే వేసవి సెలవుల్లో ఆ ప్రక్రియను పూర్తిచేస్తామంటూ విద్యాశాఖ మంత్రి గత ఏప్రిల్లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ వచ్చినా ఆ ప్రక్రియ కోర్టు స్టేతో ఉండడం విద్యాశాఖ పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నదని తెలిపారు. ఈనెల 11న బదిలీల కేసు బెంచిపైకి వచ్చినపుడు జాగ్రత్త వహించలేదనిపిస్తున్నదని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు బదిలీలు, పదోన్నతులు ఉపాధ్యాయుల సమస్యగా చూస్తున్నట్టుగా కనిపిస్తున్నదని వివరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీ అనేది వృత్తి నిర్వహణలో చురుకుదనం పెంచడం తప్ప మరొకటి కాదని తెలిపారు. పదేండ్లకుపైగా ఒకే పాఠశాలలో పనిచేయడం వల్ల స్తబ్దత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇతర శాఖల్లో మూడేండ్ల నుంచి ఐదేండ్ల సర్వీసు పూర్తయితే బదిలీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ పద్ధతిలోనే ఉపాధ్యాయుల బదిలీలు అమలు చేయాలని సూచించారు. పదోన్నతులు కూడా ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కూడా ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీ పదోన్నతుల ద్వారానే చేయాలని కోరారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చురుకుగా వ్యవహరించి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను మే వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని సూచించారు.