Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
యాసంగిలో బియ్యం కొనుగోళ్ల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి 50 సాయుధ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ప్రకటించారు. మంగళవారం సరిహద్దు రాష్ట్రాల నుంచి బియ్యంతో పాటు మద్యం అక్రమ రవాణాలను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో డీజీపీ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సందర్భంగా రాష్ట్రంలో పండిన దాదాపు 161 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదనీ, ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి అక్రమ దారుల్లో బియ్యం రవాణా జరుగుతున్నదనీ, దీనిని నిరోధించాల్సినవసరం ఉన్నదని తెలిపారు. ఇందుకోసం నాలుగు సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న పదిహేడు జిల్లాలలో మొత్తం సాయుధ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర ఎక్సైజ్ విభాగం, పోలీసు శాఖలు సమన్వయంలో పని చేయాల్సినవసరం ఉన్నదని విజిలెన్స్ విభాగాలను అప్రమత్తం చేయాల్సినవసరం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల మీదుగానే కాక ఇతర మార్గాల నుంచి కూడా బియ్యం అక్రమ రవాణా రాష్ట్రంలోకి జరిగే ప్రమాదమున్నదని అన్నారు. దీనిని అరికట్టడానికి ఆయా జిల్లాల పోలీసులతో పాటు పౌర సరఫరాల శాఖ విజిలెన్సు విభాగం కూడా సంయుక్తంగా కాపు కాయాల్సినవసరమున్నదని, అందుకు ప్రత్యేకమైన టీమ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. సరిహద్దు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి నాన్పెయిడ్ లిక్కర్ పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరగకుండా పోలీసులతో కలిసి నిరోధక చర్యలు చేపడతామని అన్నారు. ఎక్కువగా మద్యం అక్రమ రవాణా జరిగే సరిహద్దు ప్రాంతాలు గుర్తించి అక్కడ నిఘాను పెంచాల్సినవసరం ఉన్నదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగాక మహబూబాబాద్, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి జిల్లాల్లో గుడంబా తయారీని, విక్రయాలను కఠినంగా అణచివేయడానికి పోలీసు శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మొత్తమ్మీద సరిహద్దు నుంచి జరిగే బియ్యం అక్రమ రవాణా, మద్యం స్మగ్లింగ్‌లను అరికట్టడానికి కలిసి కట్టుగా కృషి చేద్దామని పోలీసు, పౌర సరఫరా, ఎక్సైజ్ శాఖాధికారులు నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులతో పాటు ఆయా జిల్లాల ఎస్పీలు, అదనపు పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు.