Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ తెలంగాణ
నవతెలంగాణ - హైదరాబాద్
ఉపాధ్యాయ బదిలీలు సాధ్యం కాకుంటే పదోన్నతులను వెంటనే చేపట్టాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. బదిలీల కోసం పదోన్నతులను వాయిదా వేయడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఒక్కసారైనా పదోన్నతుల్లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అది ఉద్యోగి హక్కని తెలిపారు. 60 శాతానికిపైగా గెజిటెడ్ హెడ్మాస్టర్లు, వేలాదిగా స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల విద్యావ్యవస్థ దారుణంగా ఉందని విమర్శించారు. జీహెచ్ఎం, కిందిస్థాయి పోస్టుల పదోన్నతులకు ఎలాంటి కోర్టు అభ్యంతరం లేకున్నా బదిలీలకు ముడిపెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు ఆలోచించాలని కోరారు. కాలయాపన లేకుండా సీనియార్టీ జాబితాను అనుసరించి వెంటనే పదోన్నతులకు షెడ్యూల్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లుగా మోడల్ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులకు సాంకేతిక కారణాలు చూపి బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యం బయటపడుతున్నదని తెలిపారు. వెంటనే పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ల సంఘం (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు తదితరులు పాల్గొన్నారు.