Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ
- కేంద్ర ప్రభుత్వానికి చేతలు తక్కువ.. ప్రచారాలు ఎక్కువ :మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి పెద్ద పీట వేస్తోందని ఆర్థిక, వైద్యా, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలో రూ.36 కోట్లతో వంద పడకల ప్రభుత్వాస్పత్రి నిర్మాణ పనులకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూల బొకే అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో రాష్ట్రం దేశానికే మోడల్‌గా మారిందన్నారు. 65 ఏండ్ల కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం చౌటుప్పల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, మర్రిగూడలో 30 పడకల ఆస్పత్రి, నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటుచేశామని తెలిపారు. రాష్ట్రం రాక ముందు మూడు కిడ్నీ డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 102 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఉచిత బస్‌పాస్ సౌకర్యం, డయాలసిస్ పేషెంట్లకు రూ.2000 పింఛన్ సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. ఉద్యమ నాయకునిగా ఈ ప్రాంతంలో పర్యటించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల అవస్థలు చూసి చలించిపోయారన్నారు. మునుగోడు, నాంపల్లి, చండూరు, నారాయణపురం మండలాలకు పీహెచ్‌సీలు 24 గంటలపాటు ఉండేలా చేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం పట్టణాలు, పల్లెల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేశామని, ఏప్రిల్ చివరిలోపు రాష్ట్రమంతటా న్యూట్రిషన్ కిట్లు అందిస్తామన్నారు. నాడు వైద్యానికి, విద్యకు కరువు ప్రాంతంగా ఉన్న రాష్ట్రం నేడు సూపర్ స్పెషాలిటీ వైద్యానికి, నాణ్యమైన వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయని, ఈ ఏడాది 9 కలుపుకుంటే మొత్తం 55కు చేరుతుందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 26 జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 35శాతం మాత్రమే ప్రసవాలు జరగగా ప్రస్తుతం 64శాతానికి పెరిగిందన్నారు. బీబీనగర్‌లోని ఎయిమ్స్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో 200 ఎకరాల భూమిని కేటాయిస్తే ప్రధానమంత్రి మోడీ ఇటీవల శంకుస్థాపన చేసి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న వైద్య సేవల పట్ల నీతి అయోగ్‌ను 15వ ఆర్థికసంఘం ప్రశంసలు కురిపించిందని తెలిపారు. చౌటుప్పల్‌లో నూతనంగా ఏర్పాటుచేస్తున్న వంద పడకల ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌నూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, సింగిల్‌విండో చైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి, పల్లె రవికుమార్‌గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.