Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మూసివేత కుట్రను అడ్డుకుంటాం
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
- ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జేఏసీ నాయకులతో భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదారాబాద్
కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్(పీఎస్‌యూ) ప్రయివేటీకరణ పరంపర కొనసాగుతోందని, చివరికి దేశానికి రక్షణ కల్పించే రక్షణశాఖకూ ప్రయివేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చెర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పరిరక్షణ జేఏసీ నాయకులు వినోద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా ముసుగులో పీఎస్‌యూలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న ప్రధాని నరేంద్రమోడీ వైఖరి ఏమాత్రం సరికాదని అన్నారు. మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీకి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా సిక్ యూనిట్‌గా చిత్రీకరించి మూసేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పి కొడతామని హెచ్చరించారు. ఆ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లు, బుల్లెట్ ప్రూఫ్, ల్యాండ్ మైన్స్ ప్రూఫ్ వాహనాలు, లాంచర్లు వంటి దేశ రక్షణ కోసం కీలక ఉత్పత్తులు తయారవుతాయని పేర్కొన్నారు. అందు వల్ల ఆ కార్మాగారానికి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు మూడున్నర వేల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. వినోద్‌కుమార్‌తో భేటీ అయిన వారిలో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు రమణారెడ్డి, ప్రభు, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, శివకుమార్, రాజయ్య, యాదగిరి, అశోక్, మల్లికార్జున్‌రెడ్డి, ప్రభు, శివశంకర్‌నాయక్, బీఆర్ఎస్. కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఉన్నారు.