Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ విడుదల
- జీవవైవిధ్యాన్ని రెండోసారి మదింపు చేసిన ఏకైక నగరంగా హైదరాబాద్
- జూన్ 5న అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగర జీవవైవిధ్య సూచీ(సిటి బయోడైవర్సిటీ ఇండెక్స్)ని మంత్రి కేటీఆర్ మంగళవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేకంగా బయోడైవర్సిటీ ఇండెక్స్ నివేదికను తయారు చేసిన ఏకైక భారతదేశ నగరంగా హైదరాబాద్ ఘనత సాధించింది. గతంలో ఒకసారి 2012లో (సిఓపి 11 సమావేశం) హైదరాబాద్, 2017లో కోల్కత్తా నగర జీవవైవిధ్య సూచిని రూపొందించాయని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బయోడైవర్సిటీ ఇండెక్స్‌ను తిరిగి రెండోసారి రూపొందించిన నగరంగా హైదరాబాద్ రికార్డులకు ఎక్కిందన్నారు. నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ, పర్యవేక్షణ, అభివృద్ధికి ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడనుందని చెప్పారు.
నివేదికలోని వివరాలు..
బయోడైవర్సిటీ రంగంలో సింగపూర్ చేసిన భాగస్వామ్యానికి గుర్తింపుగా దీన్ని సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నారు. నగర జీవవైవిధ్యం సూచీ వల్ల ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రయత్నాలు, ఈ రంగంలో స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు వంటి మెత్తం 23 రకాల అంశాలను కొలమానంగా తీసుకొని, ఈ సూచీని రూపొందించారు. తాజాగా జీహెచ్ఎంసీ ఈ బయోడైవర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 92 మార్కులకుగాను 57 మార్కులను సాధించింది. అయితే, 2012లో నగరంలో అప్పుడు జరిపిన బయోడైవర్సిటీ ఇండెక్స్ అధ్యయనంలో 36 మార్కులు మాత్రమే లభించాయి. పది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధిని సాధించింది.
జీవవైవిధ్యానికి కేంద్రాలుగా..
హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350కి పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు(రాక్ ఫార్మేషన్స్), రెండు జాతీయ పార్కులు(కేబీఆర్‌తో పాటు హరిణి వనస్థలి) నగరంలో జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో తేలింది. దీంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిసాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్‌లు జీవవైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయని తేలింది. హైదరాబాద్‌లో 1305 వృక్షజాతులు ఉండగా, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్ష జాతులు నగరంలో ఉన్నాయని తేలింది. 30 రకాల తూనీగ జాతులు, 141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు ఉన్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది.
అధికారులకు మంత్రి అభినందనలు
హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా జీవవైవిధ్య సూచీ నివేదికను తయారు చేసిన అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రపంచ స్థాయి నగరంగా మారే పరిణామ క్రమంలో జీవవైవిధ్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. జీవించు- జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, చెరువుల సంరక్షణ - బలోపేతం, అడవుల పెంపకం, అర్బన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు నగర జీవవైవిధ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. జూన్ 5వ తేదీన అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల్లో బయోడైవర్సిటీ పట్ల మరింత అవగాహన పెంచేలా చర్యలు చేపడతామన్నారు. ఆరోజు పట్టణాల్లో హరితాన్ని పెంచిన పురపాలికలకు, సిబ్బందికి హరిత అవార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.