Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ
- 21,24, 26 తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు
- మే 9 నుంచి రెండో విడత హాత్ సే హాత్ జోడో యాత్ర : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ అంశంపై తమ పార్టీ ఆధ్వర్యంలో సమర శంఖం పూరించనున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మే 4 లేదా 5న సరూర్‌నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. లీకేజీ వ్యవహరంపై ఈ నెల 21న నల్గొండలో, 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరసన సభలు నిర్వహిస్తామన్నారు. ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి...సరూర్‌నగర్ సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఏమీ చేస్తుందో స్పష్టత ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నందున మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదనీ, నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఓ సామాజిక బాధ్యతగా తీసుకుని విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదమే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆ స్ఫూర్తితోనే ఎంతో మంది యువకులు ఉద్యమం చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువత సమిధలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
ఉద్యోగాల హామీనే మోడీతోనే అధికారంలోకి...
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనే హామీతోనే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ లెక్కన ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, కానీ ఆ మాటను నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఇప్పటికే 22.6 కోట్ల దరఖాస్తులు వస్తే, 7,22,311 ఉద్యోగాలిచ్చామంటూ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు ప్రధాని సమాధానమిచ్చారని గుర్తు చేశారు. దీంతో నిరుద్యోగులను మోసం చేసినట్టు ప్రధాని అంగీకరించారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ బీజేపీ అధ్యక్షులు బండి సంజరు అంటున్నారనీ, బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ భారీ వరదల సమయంలో బండి సంజరు మాట్లాడుతూ... బైక్ పోతే బైక్ ఇస్తామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా? అని చెప్పి మాట తప్పారని విమర్శించారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలుగా ఉన్నాయో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం కాదనీ, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని సీఎం కేసీఆర్, ఒకే రోజు 2లక్షల ఉద్యోగాలని ఇస్తామంటూ బండి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.
బండిగారూ...నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి దగ్గర చేయండి
బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ హైదరాబాద్‌లో కాదనీ, మోడీ ఇంటి దగ్గర చేయాలని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా బండికి సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పాపం ముమ్మాటికీ రాష్ట్ర సర్కారుదేనని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాల్సిందేనని డిమాండ్ చేశారు. పేపర్ లీకులో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ, సంబంధిత కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.