Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం (2023-24) నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం జీవో నెంబర్ 18ని విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా వెయిటేజీ నిబంధనను అమలు చేయని విషయం తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఎంసెట్ ఆధారంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, మెడికల్, డెంటల్, ఫార్మా-డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు 2011 నుంచి జీవో నెంబర్ 73 ద్వారా ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలవుతున్నదని వివరించారు. ఆ జీవోను సవరిస్తూ వెయిటేజీని తొలగించామని తెలిపారు. ఎంసెట్‌కు హాజరైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల్లేవని పేర్కొన్నారు. వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంసెట్‌లో ర్యాంకు కేటాయిస్తారని వివరించారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఇంకోవైపు ఇంటర్ బోర్డుతోపాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇతర రాష్ట్రాలకు చెందిన బోర్డులకు చెందిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తారు. వారి మార్కులను క్రోడీకరించి వెయిటేజీ కలిపి ర్యాంకులు కేటాయించడం కొంత ఇబ్బందిగా మారిందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఇంకోవైపు ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే కనీస మార్కుల నిబంధన అమల్లో ఉంటుందని విద్యాశాఖ అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. అంటే ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో 45 శాతం మార్కులుంటేనే ఎంసెట్‌కు దరఖాస్తు చేసేందుకు అర్హులుగా ఉంటారు.
అంతకంటే తక్కువ మార్కులొస్తే ఎంసెట్‌లో వారికి ర్యాంకులు కేటాయించే అవకాశం లేదు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 70 శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి వంద శాతం సిలబస్‌తో ఎంసెట్ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులొచ్చాయి. 3.18 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వచ్చేనెల 10,11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, అదేనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.