Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 నుంచి సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలి :
సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్) ప్రొబేషన్ కాలం ఈనెల 11వ తేదీ నాటికి పూర్తయ్యిందని, వారిని రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. జేపీఎస్‌లుగా 2018, ఆగస్టులో నియామకమయ్యారని తెలిపారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎంతో ముందుచూపుతో పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను ఏర్పాటు చేసి నియమించడం పట్ల సంతోషించామని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులు మొత్తం 9,350 మంది ఉన్నారని వివరించారు. వారి నియామకం వల్ల గ్రామాల అభివృద్ధికి దోహదకారి అయ్యిందని తెలిపారు. తద్వారా గ్రామపంచాయతీలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది, హరితహారం, గ్రీన్‌పార్కుల ద్వారా పచ్చదనం, వైకుంఠధామాలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. దీంతో దేశంలోనే తెలంగాణ గ్రామపంచాయతీ వ్యవస్థ అనేక ఆవార్డులను సొంత చేసుకున్నాయని వివరించారు. దీనివెనుక ప్రభుత్వ మార్గదర్శకత్వంతోపాటు పంచాయతీ కార్యదర్శుల కృషి కూడా ఉందని తెలిపారు. ప్రొబేషన్ కాలం పూర్తయితే, రెగ్యులర్‌గా తీసుకోవడం జరుగుతున్నదని నోటిఫికేషన్లో వివరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రొబేషన్ కాలాన్ని మరో ఏడాదికి పెంచారని పేర్కొన్నారు. అది కూడా ఈనెల 11వ తేదీన పూర్తయ్యిందని తెలిపారు.