Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యం :హోం మంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హౌం మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను డీజీపీ అంజనీకుమార్, చేవెళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మెన్ కొలేటి దామోదర్, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి హౌంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పని చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోలీసులు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. మహిళల భద్రతే లక్ష్యంగా షీ టీం ఏర్పాటు చేయడం వల్ల క్రైమ్ రేటు పూర్తిగా పడిపోయిందన్నారు. అలవెన్స్ కింద పోలీస్ స్టేషన్లకు డబ్బులు ఇస్తున్నట్టు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించడంలో పోలీస్‌వ్యవస్థ విజయవంతమైందని చెప్పారు. సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్, శంకర్పల్లి పోలీస్ స్టేషన్ల పునరుద్ధరణతో పాటు, పోలీస్ క్వార్టర్స్, కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నిర్మించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరడంతో హౌం మంత్రి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ అంటే దిశా నిర్దేశం, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్, ఫార్మా సహా అన్ని రంగాల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందనీ, అందులో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో హైదరాబాద్‌లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంలో రాష్ట్ర పోలీసులు విజయవంతమయ్యారని చెప్పారు. హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏడు లక్షల సీసీ, టీవీ కెమెరాలు ఉన్నాయనీ, కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిలబడిన ఒక్క సింగిల్ టిప్‌తో సిటీలో ఉన్న ప్రతి బస్తీ, గల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చన్నారు. సామాన్యుడు కూడా పోలీసు వ్యవస్థను నిర్మాణాత్మకంగా, సమర్థవంతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. పర్ఫామెన్స్ ఇండెక్స్‌తో పోలీసుల పని తీరును లెక్కిస్తూ, మెరుగైన సేవలందించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు మాలతీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రంగారెడ్డి, వైస్ చైర్మెన్ నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, కేసారం శ్రీనివాస్ యాదవ్, శైలజ అగిరెడ్డి, మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు సత్యనారాయణ చారి, నరేందర్ చారి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.