Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జీల సమితిని ప్రారంభించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర శాసనమండలి సమావేశాల సందర్భంగా సభ్యులు ఆర్జీల రూపంలో ఇచ్చే సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. బుధవారం తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని కమిటీ హాలులో శాసన మండలి అర్జీల సమితిని ఆయన ప్రారంభించారు. సమావేశాల సందర్బంగా అనేక రకాల సమస్యలు ప్రస్తావనకు వస్తుంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ దృష్టికి రాని సమస్యలను సభ్యులు ఆర్జీల రూపంలో మండలికి సమర్పిస్తారని చెప్పారు. సమితికి ఉన్న ప్రాధాన్యత రీత్యా సభ్యులు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.
అనంతరం గుత్తా ప్రివిలేజ్ కమిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యులకు విశేష అధికారాలు, హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఇవ్వబడ్డాయని తెలిపారు. వాటికి భంగం కలిగితే పరిశీలించి చర్యలు తీసుకునేందుకు విశేషాధికారుల కమిటీకి సర్వాధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన వాటిని కమిటీకి రెఫర్ చేస్తాననీ, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ గౌరవానికి, హక్కులకు భంగం కలిగిందని భావించిన సభ్యులు తప్పనిసరిగా కమిటీ ముందుకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. శాసన మండలి అర్జీల కమిటీ, ప్రివిలేజ్ కమిటీ చైర్మెన్‌గా నియమితులైన డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ , ఆ కమిటీల సభ్యులకు ఈ సందర్భంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఫరూక్ హుస్సేన్ , సిరికొండ మధుసూదన చారి , శేరి శుభాష్ రెడ్డి,యాదవ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, తదితరులు పాల్గొన్నారు.