Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పుల కొలిమిగా సింగరేణి ఓసీ
- ఉక్కిరిబిక్కిరి అవుతున్న కార్మికులు
- 300మీ. లోతు ఓసీల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- పని ప్రదేశాల్లో షెల్టర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ నిల్
- ప్రాథమిక వైద్యం.. కనీసం మంచినీరు కరువు
- పట్టింపులేని సింగరేణి యాజమాన్యం
నవతెలంగాణ-ఇల్లందు
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఉష్ణోగ్రతలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దానికి సుమారు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ దాన్ని తలపించేలా నేడు ఎండలు భగభగమంటూ కుతకుతలాడుతున్నాయి. ముఖ్యంగా సింగరేణి ఓసీ ప్రాంతాల్లో ఎండలో బయటకు పోతే ఒళ్ళంతా మంట పుడుతోంది. 10 రోజుల నుంచి ఎండలు అదరగొడుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. సింగరేణి ఓసీల్లో పనిచేసే కార్మికుల ఉక్కపోత కష్టాలు అంతాఇంతకాదు. కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, టేకులపల్లి ఓసీలు నిప్పుల కొలిమిలా మారాయి. బయట ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలు ఉంటే.. సుమారు 300 మీటర్ల లోతులో ఉండే ఓసీల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నట్టు తెలుస్తోంది. ఎండ వేడిని తట్టుకోలేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. విధులకు హాజరు కావడానికి భయపడుతున్నారు.
ఇల్లందు ఓసీలో డంపర్స్, షేవల్స్, డ్రిల్స్, గ్రడ్డర్స్, ఎస్కార్డ్స్, వర్కర్స్, వెహికిల్స్ నడిపే డ్రైవర్స్, ఇతర సిబ్బంది కలిపి ఉమ్మడి జిల్లాలో 5000 మంది వరకు ఉన్నారు. అధికారులు ఓసీలోకి వెళ్ళే బొలెరో వాహనాలకు ఏసీలు ఉంటున్నాయి. కార్మికులు వెళ్లడానికి మాత్రం మామూలు వాహనాలు మాత్రమే యాజమాన్యం కేటాయిస్తోందని సమాచారం. కార్మికులు ఓసీలోకి వెళ్ళడానికి కిలో మీటర్ల కొద్దీ దూరం ఉంటుంది. కనుచూపు మేరలో అంతా ఎడారిని తలపిస్తుంది. వేడి తట్టుకోవడానికి కొంతసేపు నిల్చుందామన్నా నిలువ నీడ ఉండదు. దుమ్ముధూళితో ప్రదేశం అంతా నిండిపోతూ ఉంటుంది. వేడి పొగలు భగభగమంటూ నిప్పుల ఆవిరిలా పైకి లేస్తుంటుంది. ఇంతటి వేడిలో కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో కార్మికులు సేదతీరడానికి పాకలు, షెడ్డులు నిర్మించేవారు. ఇప్పుడవిలేకపోవడం వల్ల కార్మికులు అంతటి వేడిలోనే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కనుచూపుమేరలో మట్టికట్టలు, లోయలు, అగాధాల్లా కనిపించే ఓసీల్లో.. డంపర్లు, ఇతర వాహనాలు తిరగడంవల్ల దుమ్మూ, ధూళి పైకిలేవడం దీనికి తోడు విపరీతమైన వేడిగాలలు వీచడంతో కార్మికులు నీరసించిపోతున్నారు. ఎండదెబ్బకు గురై అనారోగ్యంపాలు అవుతున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కనీసం మంచినీటి సౌకర్యం కరువు
కుతకుతలాడే ఓసీల్లో వేడిని తట్టుకునేందుకు కార్మికులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కార్మిక సంఘాలంటున్నాయి. 200 మి.లీ మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, అవి కూడా నాణ్యతలేని, తయారీ తేదీ, కంపెనీ పేరు లేనివి ఇస్తున్నారని, ఇక ఓఆర్ఎస్ ఊసే లేదని కార్మికులు వాపోతున్నారు. అంతేకాదు, గతంలో చల్లటి మంచినీటి క్యాన్లు, షెల్టర్లు, ప్రాథమిక చికిత్స కిట్లు ఇచ్చేవారని, ఈ ఏడాది వాటి ఊసేలేదని కార్మికులు తెలిపారు. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు లేకపోవడంతో భగభగ మండే ఎండలకు కార్మికులు నీరసించి పడిపోయే అవకాశం ఉందని, అయినా యాజమాన్యం వారికోసం ఎమర్జెన్సీగా చికిత్సతో పాటు అంబులెన్స్ పెట్టాలనే ఆలోచన కూడా యాజమాన్యానికి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీ ఏరియాల్లో ప్రాథమిక చికిత్స చేయడానికి ఏఎన్ఎంతో పాటు వైద్యసౌకర్యం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
పనివేళలు మార్చాలి : సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్
యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు, బ్రాంచి కార్యదర్శి ఎండీ అబ్బాస్
ఓసీల్లో వేడీ విపరీతంగా ఉంటుంది.. దాన్ని తట్టుకుని కార్మికులు పనిచేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, 2వ షిప్ట్ సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11వరకు, 3వ షిప్ట్ రాత్రి 11.30 నుంచి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. మజ్జిగ ప్యాకెట్స్ రోజుకు నాలుగు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ రెండు, కార్మికులు సేద తీరడానికి మంచినీటి సౌకర్యం, పాకలు లేదా షెడ్లు ఏర్పాటు చేయాలి.