Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియాలో పరామర్శించిన పాలడుగు భాస్కర్
- బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుద్ఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూక్యా వెంకటేశ్‌ను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్ బుధవారం పరామర్శించారు. బాధితున్ని, అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం పాలడుగు భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడులో విధుల్లో భాగంగా గ్రామపంచాయతీ కార్మికుడు భూక్యా వెంకటేశ్ కరెంట్పోల్పైకి ఎక్కి పనిచేస్తూ విద్యుద్ఘాతానికి గురయ్యాడని తెలిపారు. దీనివల్ల కాళ్లు, చేతులూ పూర్తిగా చచ్చుపడిపోయాయన్నారు. ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు కాళ్లూ తీసేశారని తెలిపారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్లనే ఆ కార్మికుడు నేడు తన రెండు కాళ్లను కోల్పోవాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రెండెకరాల సాగు భూమి ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు కారణమైన సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకోవాలని భాస్కర్ డిమాండ్ చేశారు.