Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ వత్తిడికి తలొగ్గిన 'జీవా'
- ఆర్భాటంగా టీఎస్ఆర్టీసీలో ప్రారంభం
- ఆ తర్వాత ఊసే లేని వైనం
- ఆయిల్‌ఫెడ్, మిషన్‌భగీరధ, వాటర్‌బోర్డు... ప్రయత్నాలు అనేకం
- ఏటా వేసవికి ముందు ఇదే హడావిడి
- కార్పొరేట్ లాబీయింగ్‌తో సర్కారు సైలెంట్
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
''టీఎస్ఆర్టీసీ ఏటా 90 లక్షల లీటర్ల వాటర్ బాటిళ్లను బయటినుంచి కొని వినియోగిస్తుంది. ఇక ఆ పరిస్థితి ఉండదు. సొంతబ్రాండ్ 'జీవా' వాటర్ బాటిళ్లనే వాడతాం. స్వచ్ఛత, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నాం. టీఎస్ఆర్టీసీ సొంతబ్రాండ్తో మార్కెట్లోకి వస్తున్న స్వచ్ఛమైన తాగునీరు 'జీవా'ను ప్రజలు ఆదరించాలి. ఆర్టీసీ ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో ఇది ఒకటి'' ఈ ఏడాది జనవరి 9వ తేదీ హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎమ్జీబీఎస్)లో టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్ 'జీవా' వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ చెప్పిన మాటలు ఇవి. లీటర్, అరలీటర్, 250 ఎమ్ఎల్ బాటిళ్లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని ఆరోజు చెప్పారు. అక్కడితో సీన్ కట్‌చేస్తే...ఆరోజు ఎమ్‌జీబీఎస్‌లో కనిపించిన 'జీవా' మళ్లీ ఇప్పటి వరకు కనిపిస్తే ఒట్టు! ఈ నీటి వ్యాపారం కోసం టీఎస్ఆర్టీసీ భారీ కసరత్తునే చేసింది. వాటర్‌బాటిళ్ల మోడల్, పేరు సెలక్షన్ కోసం ఆన్లైన్ పోటీలు కూడా నిర్వహించింది. జనవరిలో నీళ్ల బాటిళ్లు లాంచ్ కాగానే, కార్పొరేట్ నీటి వ్యాపార సంస్థల లాబీయింగ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీనితో 'జీవా'కు అక్కడే సజీవ సమాధి కట్టినట్టు తెలుస్తుంది. ఈ తరహా ప్రయత్నం గతంలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా రమణారావు ఉన్నప్పుడు కూడా జరిగింది. అప్పట్లో ఎట్టకేలకు నీటి వ్యాపారాన్ని 'బిస్లరీ' కంపెనీకి అప్పగించారు. ఇప్పుడు సజ్జనార్ హయాంలోనూ అదే హడావిడి చేసి, చివరకు ఆ ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకున్నట్టు తెలుస్తుంది. లాభాలు కురిపించే నీటి వ్యాపారంలోకి ప్రభుత్వరంగ సంస్థలు రాకుండా 'కార్పొరేట్' లాబీయింగ్ గట్టి ప్రయత్నాలే చేసిందని బస్టాండ్లలోని స్టాల్స్ వ్యాపారులు చెప్తున్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సొంత జిల్లా ఉమ్మడి ఖమ్మంలోని బస్టాండ్లలో కూడా 'జీవా' కనిపించకుండా మాయం అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ఖరారు కాలేదనీ, అందుకే నీళ్ల బాటిళ్లు బస్టాండ్లలోకి రాలేదని ఖమ్మం బస్టాండ్ క్యాంటిన్ నిర్వాహకులు 'నవతెలంగాణ'కు తెలిపారు. ఇక హైదరాబాద్‌లోని ఎమ్జీబీఎస్, జూబ్లీ బస్టాండ్లలో (జేబీఎస్) కార్పొరేట్ కంపెనీల నీళ్ల బాటిళ్లే కనిపిస్తున్నాయి. వాటితోపాటు ఆ పేర్లనే పోలినట్టుండే కిల్బీ, అక్వాఫైన్ అంటూ చిన్న అక్షరం తేడాతో రకరకాల బ్రాండ్ల లోకల్ నీళ్ల బాటిళ్ళను అమ్మేస్తున్నారు. ఈ లొల్లిని నియంత్రించేందుకే టీఎస్ఆర్టీసీ సొంత బ్రాండ్‌తో నీళ్లను తీసుకొస్తుందని ప్రచారం చేశారు.
స్పందించని అధికారులు
'జీవా' వాటర్ బాటిళ్లు మార్కెట్లోకి ఎందుకు రాలేదనే అంశాన్ని టీఎస్ఆర్టీసీలో సంబంధిత అధికారుల వద్ద ప్రస్తావిస్తే, దానిపై స్పందించేందుకు వారు నిరాకరించారు. కొందరు అధికారులకు ఫోన్ చేసి వివరణ కోరితే, బిజీగా ఉన్నామనీ, మళ్లీ చేయండనీ చెప్పుకొచ్చారు. వాట్సప్ ద్వారా మెసేజ్‌లు పెడితే 'బ్లూ'టిక్ వచ్చినా స్పందించలేదు. మర్మం ఏంటో?
కొత్తేం కాదు...
ఏటా వేసవి సమీపించే సమయంలో వాటర్ బాటిళ్ల వ్యాపారం చేస్తున్నామంటూ ఏదో ఒక ప్రభుత్వరంగ సంస్థతో హడావిడి చేయించడం పరిపాటిగా మారింది. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లరు అండ్ సివరేజ్ బోర్డ్ (వాటర్‌బోర్డు) 20 లీటర్లు, లీటరు, అరలీటరు, 200 మి.లీ., వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు తయారు చేస్తున్నా మంటూ ఆసక్తి వ్యక్తీకరణ పేరుతో ఎంక్వయిరీ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత అది అటకెక్కింది. ఆ తర్వాత మిషన్ భగీరథ పేరుతో వాటర్‌బాటిళ్లు మార్కెట్లోకి తెస్తున్నామని కొన్ని నమూనా బాటిళ్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అవీ కనిపించలేదు. ఇక 2021లో తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్ఆయిల్ఫెడ్) ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 'కిన్నెర' పేరుతో రూ.3 కోట్ల వ్యయంతో వాటర్ బాటిళ్ల ప్లాంటు ఏర్పాటు చేశారు. కోవిడ్‌లో అది కొట్టుకుపోయింది. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ నీటి వ్యాపారాన్ని ప్రచారంలోకి తెచ్చారు. కార్పొరేట్ దెబ్బకి వెనక్కి మళ్ళారు.