Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ అక్రమాలపై సమాధానమివ్వడంలో మోడీ విఫలం
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసు రాజ్యం
- గాంధీ, ఆజాద్, నెహ్రూ వంటివారి చరిత్ర లేకుండా చేస్తున్న వైనం
- అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న గవర్నర్లు
- కేంద్రం విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలి: సీపీఐ(ఎం)
- పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్ పిలుపు
- బీజేపీని వ్యతిరేకిస్తున్నందుకే బీఆర్ఎస్ను సమర్థిస్తున్నాం
- హామీల అమలు కోసం ఉద్యమిస్తాం ొ వారంలో సీఎం కేసీఆర్‌ను కలుస్తాం
- లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్ విమర్శించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో కలిసి విజయరాఘవన్ మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించామన్నారు. ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని చెప్పారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంటు ఆమోదించిందని అన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చలేదని, నిరుద్యోగం తీవ్రంగా ఉన్నా తగ్గించే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినా దానిపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. ప్రతిపక్ష
సభ్యులు అడిగిన ప్రశ్నలు, అదానీ-మోడీ మధ్య ఉన్న సంబంధంపై సమాధానమివ్వడంలో ప్రధాని విఫలమయ్యారని చెప్పారు. ఇటీవల యూపీలో పోలీసుల ముందే ఓ వ్యక్తిని హత్య చేశారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడుతున్నాయని, పోలీసు రాజ్యం నడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల నుంచి గాంధీ, అబుల్‌కలాం ఆజాద్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను తొలగిస్తున్నారని అన్నారు. వారిని బీజేపీ గౌరవించడం లేదన్నారు. లౌకికత్వంపై దాడి చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. కేరళలో ప్రజలకు నాణ్యమైన విద్య అందించే విధానం అమల్లో ఉందన్నారు. డిజిటల్ విద్య పేదలకు అందుతున్నదని వివరించారు. విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్య అందించేందుకు కేరళ అసెంబ్లీ బిల్లులను పంపినా గవర్నర్ వాటిని ఆమోదించడం లేదన్నారు. తెలంగాణ, తమిళనాడులోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల ఢిల్లీలో సమస్యల పరిష్కారం కోసం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఉద్యమించారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రైతులు పెద్దపోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజా ఉద్యమాలకు సీపీఐ(ఎం) మద్దతుగా ఉంటుందన్నారు. వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఐక్యమై బీజేపీ విధానాలపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయంగా స్నేహం... సమస్యలపై పోరాటం : తమ్మినేని
బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తప్పులను విమర్శిస్తాం, ఒప్పును సమర్థిస్తామని అన్నారు. బీజేపీ విధానాలు ప్రమాదకరమని, అందుకే కేసీఆర్‌ను సమర్థిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తున్నదని చెప్పారు. ఇతర పార్టీల వారిని ప్రలోభాలకు గురిచేసి, లేదంటే బెదిరించి తమలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు, ఇక్కడ కవితను ఈడీ విచారించడం అందులో భాగమేనని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడమే తమ లక్ష్యమన్నారు. అందుకే బీఆర్ఎస్కు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. భవిష్యత్తులో సీట్ల పొత్తు ఉండే అవకాశముందన్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 50 వేల మంది గుడిసెలు వేసుకున్నారని అన్నారు. కోరుట్ల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి వంటి ప్రాంతాల్లో గుడిసె వాసులపై పోలీసులు దాడులు చేస్తున్నారని చెప్పారు. గుడిసెలు వేసే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తామని అన్నారు. అన్ని జిల్లాల్లో వచ్చేనెలలో సీపీఐ(ఎం) నాయకుల పర్యటనలుంటాయని, అవసరమైతే పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా పాల్గొంటారని వివరించారు. ఆ గుడిసెలకు పట్టాలివ్వాల్సిన ప్రభుత్వం నిర్బంధం మోపుతున్నదని విమర్శించారు. 58 జీవో ప్రకారం పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. జూన్‌లో ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యతోపాటు ఇతర సమస్యలపై కేంద్రీకరిస్తామని చెప్పారు. వీఆర్ఏలు రెండు నెలలు సమ్మె చేసి ప్రభుత్వ వాగ్దానంతో విరమించారని గుర్తు చేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఆ రెండునెలల వేతనం ఇస్తామన్నారని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను ఏప్రిల్ ఒకటి నుంచి రెగ్యులరైజ్ చేస్తామన్నారని వివరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారని చెప్పారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులిస్తామన్నారని అన్నారు. దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆసరా పెన్షన్ల సమస్యలతోపాటు, డీఎస్సీ-98, 2008 వారికి ఉద్యోగాలివ్వాలని, ఆర్ఎంపీలకు శిక్షణనిస్తామన్నారని గుర్తు చేశారు. ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జూన్‌లో సంతకాల సేకరణ, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, నిరసనలు చేపడతామని అన్నారు. చలో అసెంబ్లీ లేదా ప్రగతి భవన్ కార్యక్రమానికి ప్రజాసంఘాల పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణను రూపొందించిందని వివరించారు. ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తాము కూడా అందులో పాల్గొంటామని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో 30 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు షాక్‌కు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సిట్, సీబీఐతో కాకుండా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. వారంరోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యలపై వివరిస్తామని అన్నారు. అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో తాము పాల్గొనబోమని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు తమ్మినేని సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ ఆయా పార్టీలు ప్రకటిస్తున్నాయని, తాము అలా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా బీజేపీని ఓడించే స్థాయిలో కాంగ్రెస్ లేదన్నారు. అయితే బీఆర్ఎస్తో సీట్ల గురించి ఇంకా చర్చ జరగలేదన్నారు. తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని చెప్పారు. తాము కోరుకున్నట్టుగా బీఆర్ఎస్ సీట్లు ఇవ్వకపోతే విడిగా పోటీ చేస్తామని అన్నారు.