Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లాల్లోనే కాంటా వేస్తున్న దళారులు
- వడగండ్ల భయం.. జాడలేని కొనుగోలు కేంద్రాలు
- 353 కేంద్రాలకుగాను షూరు చేసింది రెండే!
- పంటను ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకునేందుకు రైతుల సుముఖం..
- ఈసారి పంట కొనుగోలు లక్షాన్నీ తగ్గించుకున్న ప్రభుత్వం
- ఇదే అదనుగా పచ్చివడ్ల పేరుతో రూ.1600 నుంచి రూ.1700లోపే దళారుల చెల్లింపు
- వచ్చినకాడికి చాలన్న భావనతో రైతులూ ప్రయివేటుకే మొగ్గు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో వరి కోసింది కోసినట్టుగా దళారులు దండుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు రూ.200కోత పెట్టి ముందు గానే డబ్బులు చేతికందిస్తూ కల్లాల్లోనే కాంటా వేస్తున్నారు. ప్రభుత్వం వారం కిందటే అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పినా ఒకటి రెండుచోట్ల తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపా రులు క్వింటా ధాన్యానికి పచ్చివడ్లనే పేరుతో రూ.1600 నుంచి రూ.1800 మధ్యన చెల్లిస్తూ ఎక్కడిక్కడ కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లలో జాప్యం, తూకంలో కోతలు, ఖాతాల్లో డబ్బుల జమకు ఆలస్యం తదితర కారణాలతో రైతులు ప్రయివేటుకు అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించుకోవడం గమనార్హం.
కరీంనగర్ జిల్లాలో 2022-23 ఈ యాసంగిలో 2,73,112 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సాగు మొత్తంలో 6.20లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 40శాతం మేర (లక్షా 68వేల మెట్రిక్టన్నుల) ధాన్యం ప్రయివేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులు కొనుగోలు చేస్తారని భావించారు. మిగిలిన 60శాతం (4లక్షలా 52వేలా 885 మెట్రిక్టన్నుల) ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధేశించు కున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 353 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
ఇందులో ఐకేపీ నుంచి 56, పీఏసీఎస్ 245, డీసీఎమ్ఎస్ 51 కేంద్రా లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తొలుత ఏప్రిల్లో 45వేల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, మిగిలిన 4.08లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేలో సేకరిం చాలని నిర్ణయించారు. గతేడాది యాసంగిలో 2,49,780 ఎకరాల్లో వరి సాగుకాగా.. 5.92లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు భావించారు. ఇందులో 3.39లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకోగా చివరికి 3లక్షల మెట్రిక్ టన్నుల వరకు సేకరించింది. ఈ సారి లక్ష్యం భారీగా ఉన్నా.. ఇంకా కొనుగోలు కేంద్రాల ప్రారంభం దగ్గరే ఉండటం గమనార్హం.
ప్రతి ఊళ్లో సగంమేర ప్రయివేటుకు..?
ఈసారి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతియేటా సేకరిస్తున్న ధాన్యం మిల్లర్లకు అప్పగించడం, వారు తిరిగి సీఎంఆర్ రూపంలో ఎఫ్సీఐకి సకాలంలో అందించకపోవడం వంటి కారణాలతో పెద్దఎత్తున రాష్ట్ర సివిల్ సప్లరు సంస్థకు నష్టం వస్తోంది. దాంతో ఈసారి రైతుల నుంచి తక్కువ మొత్తంలో దిగుబడిలో 60శాతం మేర ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల మొదటి వారంలోనే ప్రారంభించాల్సిన ప్యాడీ సెంటర్లను ఇంకా ఆలస్యం చేస్తోంది. దీంతో ముందుగా నాట్లు వేసుకున్న రైతుల పొలాల్లో కోతలు సాగుతున్నాయి. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి గొలకమీద ఉండగానే గింజలో తేమశాతం తగ్గుతోంది. మళ్లీ ఆ ధాన్యం ఆరబోయడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడం వంటి వ్యయప్రయాసాలకంటే ప్రయివేటుకు అమ్ముకునేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
అయితే ప్రభుత్వం 'ఏ' గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర ప్రకటించింది. ప్రయివేటు వ్యాపారులు రూ.1800 వరకు చెల్లిస్తున్నారు. క్వింటాపై రూ.200 నష్టం భరించి అయినా కోతలు పూర్తవగానే.. కల్లాల్లోనే ప్రయివేటు వ్యాపారులకు పంటను అమ్ముకునేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.