Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ప్రయివేటు, కార్పొరేట్ అనుకూల విద్యావిధానం
- రాజ్యాంగం, దాని విలువలు ధ్వంసం: కొండపల్లి దుర్గాదేవి ప్రథమ వర్ధంతి సందర్భంగా సెమినార్లో జేఎన్యూ ప్రెసిడెంట్ ఐషీ ఘోష్, ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నూతన విద్యావిధానంతో మహిళలకు విద్య దూరం అవుతుందని ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఐషీ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం మొత్తం మార్కెట్ అయిందన్నారు. ఈ మార్కెట్ వ్యవస్థలో భాగంగా కోచింగ్ సెంటర్స్ పుట్టుకొచ్చాయని, విద్య బాగా కమర్షియల్ అయిందని తెలిపారు. దేశంలో ప్రభుత్వ విద్య అందరికీ అందకుండా పోతుందన్నారు. కొండపల్లి దుర్గాదేవి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమె కుమారుడు, కోడలు పావన్, వినత నేతృత్వంలో ఐద్వా ఆధ్వర్యంలో ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన 'నూతన విద్యావిధానం- విద్యార్థినులపై ప్రభావం' సెమినార్లో ఆమె మాట్లాడారు. ముందుగా దుర్గాదేవి చిత్రపటానికి ఐషీ ఘోష్, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పూలమాల వేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గండ్లూరి కిషన్ రావు సతీమణి నర్సుబాయమ్మను సన్మానించిన అనంతరం ఐషీ ఘోష్ మాట్లాడారు.
భారతదేశంలో విద్యాభివృద్ధికి అనేక వనరులున్నాయని, కాని వాటిని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రయివేటు విద్యాసంస్థల్లో రాజ్యాంగ హక్కులు హరించివేస్తు న్నారని చెప్పారు. రిజర్వేషన్స్, భావప్రకటన స్వేచ్చను హరించే చర్యలు విద్యాసంస్థల్లోకి వస్తున్నాయన్నారు. బీజేపీ విద్యారంగాన్ని పూర్తిగా మతతత్వీకరణ చేస్తుందని, తదనుగుణంగా సిలబస్లో మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు చేస్తున్నారని తెలిపారు. దాంతో ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమవు తున్నారన్నారు. ఉన్నత విద్యను పేద విద్యార్ధుల నుంచి దూరం చేసేందుకు ఫారిన్ యూనివర్సిటీ లను ఆహ్వానిస్తుందని ఆ విద్యాలయాలకు మన దేశ చరిత్ర, అర్ధ శాస్త్రం, రాజకీయ శాస్త్రం తెలుస్తుందా అని ప్రశ్నించారు. ఈ దేశ జాతీయోద్యమ నాయకుల చరిత్ర సిలబస్ నుంచి తొలగించడం అత్యంత దారుణమని తెలిపారు.
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫండ్స్ ఇవ్వకపోవడం, ఫెలోషిప్స్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడం, బడ్జెట్లో నిధులు పెంచకుండా ఉండటం లాంటివి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో దేశాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని చెప్పారు. భారతదేశ భవిష్యత్తుకు స్థంభాలైన విద్యార్థులే ఈ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కొండపల్లి దుర్గాదేవి, మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ముందు కెళ్లాలని చెప్పారు.
ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ.. మూఢాచారాలు, మహిళా చైతన్య కోసం కొండపల్లి దుర్గాదేవి ఉద్యమించారన్నారు. తన కుటుంబంలో కులాంతర వివాహాలు చేయడమే కాకుండా సమాజంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించారని చెప్పారు. విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం రావాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాడాలన్నారు. దుర్గాదేవి కుమారుడు పావన్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినీ ఐషీ ఘోష్ కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, బుగ్గవీటి సరళ, అఫ్రోజ్ సమీనా, జిల్లా నాయకులు మెరుగు రమణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.