Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. నెల రోజులు గడిచినా ఆ కేసులో పురోగతి లేదని తెలిపారు. కేసులో సిట్ అధికారులు 18 మంది నిందితులను అరెస్టు చేసినట్టే చేసి, వారిని భద్రంగా చూసుకుంటున్నారని విమర్శించారు. లీకేజీ కేసు పాత్రదారులపై పీడీ యాక్టు కింద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ మీద ప్రత్యేక కేసును ఎందుకు నమోదు చేయడంలేదో వివరించాలని కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాసి రెండేళ్లు దాటినా ఫలితాలు ప్రకటించలేదని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామకాల్లో సింగిల్ పీజీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు మాత్రమే అవకాశమిచ్చి, మిగతా వారికి అర్హత లేదనడం అన్యాయం పేర్కొన్నారు.దీనిపై విద్యాశాఖ మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.