Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో సీఐటీయూ గెలుపు ముమ్మాటికీ కార్మికులదేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. సీఐటీయూని గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్కేవీకి ప్రభుత్వం అండదండలు అందించినా, లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా కార్మికులు సీఐటీయూ పక్షాన నిలబడటం మంచి పరిణామమని పేర్కొన్నారు. కంపెనీలో తమ హక్కుల కోసం సీఐటీయూ నికరంగా పోరాడుతున్నది కాబట్టే సీఐటీయూకి వరుసగా మూడోసారి కార్మికులు పట్టం కట్టారని తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు ఈ విజయం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లతో కార్మికుల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కనీస వేతనాలకు గెజిట్ విడుదల చేయకుండా కంపెనీ యాజమాన్యాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న తీరును ఎండగట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.