Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఫైనాన్షియర్స్ నుంచి తీసుకున్న కోట్లాది రూపాయలపై ఆరా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు గురువారం కూడా కొనసాగాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఈ చిత్ర నిర్మాణ సంస్థపై మొదట ఐటీ అధికారులు దాడులు జరిపారు. మైత్రి మూవీస్ నిర్మించిన చిత్రాలలో పెట్టుబడులు, తద్వారా వచ్చిన ఆదాయం సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా పుష్ప-2 సినిమా నిర్మాణంలో సైతం భారీ ఎత్తున పెట్టుబడులను ఈ నిర్మాణ సంస్థ పెట్టిందనీ, అందులో విదేశాల నుంచి దాదాపు రూ. 500 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయనీ, అవి ఎక్కడ నుంచి వచ్చాయి? దానికి సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లింపులు జరిగాయా? అనే కోణంలో తాజాగా ఐటీ అధికారులు దృష్టిని సారించారని తెలిసింది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్‌లోని మైత్రి మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నిర్మాణ సంస్థకు చెందిన యాజమాన్యాల నివాసాల పైనా బుధవారం ఐటీ దాడులు ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా గురువారం కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ముంబయికి చెందిన కొందరు ఫైనాన్షియర్ల నుంచి కూడా భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులను సేకరించి బాలీవుడ్లో చిత్ర నిర్మాణంపై ఆ నిధులను వ్యయం చేస్తున్నదనే కోణంలో కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ముంబయికి చెందిన కొందరు ఫైనాన్షియర్ల కార్యాలయాలపై కూడా ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఈ సంస్థకు చెందిన ఆడిటర్లు, అకౌంటెంట్లు, యాజమాన్యాల నుంచి ఆదాయపు పన్ను లెక్కలకు సంబంధించిన వివరాల సేకరణలో ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందం బిజీబిజీగా ఉన్నట్టు తెలిసింది.