Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడాన్ని సవాల్ చేసిన పలు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ గురువారం ప్రకటించింది. ప్రభుత్వం ఏకపక్షంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందనీ, వీఆర్వోల అభిప్రాయాలను కూడా తీసుకోలేదని పిటిషనర్ల వాదన. రెవెన్యూ డిపార్ట్మెంట్ డిజిటలైజేషన్, ధరణి ఏర్పాటు వల్ల వీఆర్వోలతో పని లేదని ప్రభుత్వం చెప్పింది. వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
మార్గదర్శి కేసులో వాదనలు పూర్తి
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీలో ప్రయివేటు ఆడిటర్‌తో ఆడిట్‌కు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఆడిటింగ్ చేసేందుకు వేములపాటి శ్రీధర్‌ను ఏపీ ప్రభుత్వం నియమించడాన్ని సవాల్ చేసిన రిట్‌ను జస్టిస్ ముమ్మినేని సుధీర్ విచారించారు. గురువారం తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అక్రమాల ఆరోపణలు వచ్చినప్పుడు ఆడిట్ చేయించేందుకు చిట్‌ఫండ్ యాక్ట్ నిబంధనలు అనుమతిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లీడర్ చెప్పారు. పిటిషన్లో ఉత్తర్వులు జారీ వద్దని ఆడిటర్ లాయర్, ఆడిటింగ్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మార్గదర్శి న్యాయవాది వాదించారు.
వివేకా హత్య కేసులో వాదనలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు షేక్ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని వైఎస్ భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి సవాల్ చేసిన కేసులో దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులిచ్చింది. పిటిషన్‌ను జస్టిస్ సురేందర్ గురువారం విచారించారు. దస్తగిరికి నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి విచారణను జూన్ నెలకు వాయిదా వేశారు.
న్యాయవాదులను అనుమతించాలి
సీబీఐ విచారణలో వేసే ప్రశ్నలు లిఖితపూర్వంగా ఇచ్చేలా ఆదేశాలివ్వాలని వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదరుకుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సురేందర్ గురువారం విచారించారు. ఆ విధమైన ఉత్తర్వుల జారీకి న్యాయమూర్తి నిరాకరించారు. అయితే, వారిద్దరిని సీబీఐ విచారించేటప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకే వాళ్ల లాయర్లను అనుమతించారనీ, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పిటిషనర్ల లాయర్ వాదించారు. విచారణ చేసేప్పుడు న్యాయవాదులను అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు. లాయర్లను సీబీఐ విచారణకు అనుమతించాలని ఆదేశించారు. విచారణను ఆడియో, వీడియో తీయాలని కూడా ఆదేశించారు.
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి : సీబీఐ
వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సుమలత గురువారం విచారించారు. హత్య కేసులో కీలక వ్యక్తి గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయకపోతే సాక్షులను ప్రభావతం చేస్తారని సీబీఐ వాదించింది. బెయిల్ రద్దుకు ఏపీ హైకోర్టు నిరాకరించేప్పుడు అన్ని అంశా లను పరిగణనలోకి తీసుకుందనీ, ఆ ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదని గంగిరెడ్డి న్యాయవాది చెప్పారు. విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.