Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అహల్యా రంగేకర్, దుర్గాదేవి పోరాట స్ఫూర్తితో ఉ్యమాలను నిర్మించాల్సిన అవసరముందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహిళా ఉద్యమ నేతలు దుర్గాదేవి, అహల్యా రంగేకర్ వర్ధంతులను సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజాతంత్ర మహిళ సంఘం నిర్మాతల్లో దుర్గాదేవి ఒకరని గుర్తుచేశారు.పేద మహిళల కోసం ఆమె అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. సారా వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. అహల్యా రంగేకర్ చట్ట సభల్లో మహిళల హక్కులకోసం పోరాడారని తెలిపారు. చనిపోయేంత వరకు మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాడారని గుర్తుచేశారు. ఐద్వా ఉపాధ్యక్షురాలు బత్తుల హైమవతి మాట్లాడుతూ.. దుర్గాదేవి గిరిజన మహిళల సమస్యలు, పోడు భూములు సమస్యలపై నిర్వహించిన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళల పేరుతోనే భూములకు పట్టాలివ్వాలంటూ ఉద్యమాలు నడిపారని వివరించారు. కె.ఎన్ ఆశలత మాట్లాడుతూ.. దుర్గాదేవి ధనిక కుటుంబం నుంచి వచ్చినా సాధారణ మహిళాగానే జీవించారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాచర్ల భారతి, బి. అనురాధ బి. కవిత తదితరులు పాల్గొన్నారు.