Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జూలకంటి మద్దతు
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమస్యలను పరిష్కరించాలని ఐకేపీ వీఓఏలు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మెకు వారు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. వీఓఏల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చొరవ చుపాలన్నారు. గ్రామాలలో సేవ చేస్తున్న వీఓఏల కృషిని ప్రభుత్వం గుర్తించి, వారి సేవలను క్రమబద్ధీకరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో వారి సేవలు అనిర్వచనీయమని అటువంటి వారికి ప్రభుత్వం తక్షణమే వైద్య సహాయం కింద వైద్య ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. పని భారాన్ని తగ్గించి వారికి సెర్ఫ్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పిల్లుట్ల సైదులు, మండల అధ్యక్షులు కందుకూరి రమేష్, వీఓఏల బాధ్యులు కే. లక్ష్మి, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.చిట్యాల మండల కేంద్రంలో ఐకేపి వివోఏల సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య మద్దతు తెలిపారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఐకేపీ, వీఓఏల నిరవధిక సమ్మె కొనసాగింది. నాంపల్లిలో వీఓఏలకు బీఎస్పీ నాయకులు మద్దతు పలికారు. చండూరు మండలంలో వీఓఏల సమ్మె కొనసాగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీవోఏ దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. భద్రాచలంలో ప్రధాన సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చర్లలో దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ అలుబెల్లి నర్సిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీవోఏ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దుమ్ముగూడెంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సంఘీభావం తెలిపారు. ఇల్లందులో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబి దీక్షలను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కూసుమంచిలో బస్టాండ్ సెంటర్ నుంచి ఐకేపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం ఏపీఎం సత్యవర్థన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఐకేపీ వివోఏల సమస్యలను పరిష్కరించండి : సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐకేపీ వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో 17,608 గ్రామసంఘాల సహాయకులు (వీఆర్ఏ)పనిచేస్తున్నారని తెలిపారు. 19 ఏండ్ల నుంచి గ్రామాల్లో మహిళల అభ్యున్నతి కోసం, మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.