Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలన్నదే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశయమనీ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆలక్ష్యంతో ఆయన ముందుకు పోతున్నారని చెప్పారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసమే చంద్రబాబు నిరంతరం కషి చేస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఆయన పార్టీలో ప్రతిరోజూ అందరితో చర్చిస్తున్నారని చెప్పారు. గురువారం ఎన్టీఆర్భవన్లో ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తదనంతరం కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు 73 ఏండ్ల వయస్సులోనూ నిరంతరం యువకునిలా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి రోజూ ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేస్తే బాగుంటుందని పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో ఐదో తేదిన బాబు జగ్జీవన్ రామ్, 11వ తేదిన జ్యోతిరావుపూలె, 14వ తేదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల మాదిరిగానే ఈ మాసంలోనే మన నాయకుడు చంద్రబాబు పుట్టిన రోజును 20వ తేదీన జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు కాసాని వీరేష్, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఎం.కె. బోస్, ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపి, లీగల్ సెల్ అధ్యక్షులు రఘు వర్థన్ ప్రతాప్, సాంస్కతిక విభాగం అధ్యక్షులు చంద్రహాసన్, రాష్ట్రపార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు సాయి తులసి, సంధ్యపోగు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి మన్నె సంజీవరావు, భువనగిరి పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్ కుందారపు కష్ణాచారి, అజ్మీరా రాజునాయక్, గడ్డి పద్మావతి, షేక్ ఆరిఫ్, తాళ్లూరి జీవన్ కుమార్, వేజెండ్ల కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.