Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసులు,
- నివాళులర్పించిన వివిధ పార్టీల నాయకులు
నవతెలంగాణ- ఇంద్రవెల్లి
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన మృతవీరుల స్థూపానికి ఆదివాసీ గిరిజనులు, గిరిజనేతరులు ఘన నివాళులర్పించారు. ఆనాటి నెత్తుటి గాయానికి 42ఏండ్లు పూర్తికావడంతో గురువారం మృతవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. పోలీసుల పహారా మధ్య నిర్వహించిన ఈ సభకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు, ఆదివాసీ సంఘాలు స్థూపం వద్ద సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనాటి ఘటనను స్మరించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జనం తరలిరావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ షర్మిల, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హాజరై మృతవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో మాట్లాడారు. పోడు భూముల పట్టాల కోసం పోరాడిన ఆదివాసీ మహిళలను ముఖ్యమంత్రి కేసీఆర్ జైల్లో పెట్టారని విమర్శించారు. జులైలోగా పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మహిళా కమిషన్ సభ్యులు ఈశ్వరీబాయి స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెడ్మ బొజ్జు, నాయకులు బొంత ఆశారెడ్డి. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆత్రం భుజంగ్రావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్సా పోచయ్య తదితరులు పాల్గొన్నారు.