Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూసేకరణకు నిధులు కరువు
- బడ్జెట్లో కేటాయింపు రూ.500 కోట్లే
- గత ఏడాదీ రూ. 600 కోట్లే ఖర్చు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ నగరంతోపాటు మరో నాలుగు జిల్లాలను కలుపుతూ నిర్మించతలపెట్టిన రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణ ప్రక్రియ ఆలస్య మయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ను రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భాగానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయి టెండర్లు సైతం పిలిచారు. దీనికి 6,480 కోట్లు కాగా, 182 కిలోమీటర్ల మేర నిర్మితం కానుంది. అలాగే ఉత్తర భాగానికి రెండు వారాల క్రితం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. దీనికి 158 కిలోమీటర్లకుగాను రూ.9,164 కోట్లు అవసరమవుతాయి. రెండు భాగాలు కలిపి 340 కిలోమీటర్లు. మొత్తంగా రెండు దశలకు రూ.17 వేల కోట్లు ఖర్చుచేయనున్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ వ్యవహారం ఇప్పుడు చర్చనీ యాంశమవుతున్నది. ఎనిమిది లైన్ల రింగురోడ్డు నిర్మాణాని కయ్యే భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టేందుకు అవసరమయ్యే నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. గత బడ్జెట్ కంటే కూడా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు రూ.250 కోట్లు తక్కువగా చూపించడమే ఇందుకు సాక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే ఈ నిధులు ఆ ప్రాజెక్టు భూసేకరణకు ఏమాత్రం సరిపోవని ఆ శాఖా అధికారులే చెబుతున్నారు. సుమారు రూ.1400 కోట్లు ఇటీవల బడ్జెట్లో కేటాయించి ఉంటే, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగేదని అంటున్నారు.
చెరిసగం
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుండగా, భూసేకరణకు అయ్యే ఖర్చును మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భరించాల్సి ఉంటుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్ఆర్ఆర్కు ఇచ్చిన నిధులు భూసేకరణకు సరిపోయేలా లేవు. దీంతో ఆ ప్రక్రియ ఆలస్యం కానుంది. గతేడాది 2021-22 బడ్జెట్లో రూ. 750 కోట్లు కేటాయించగా, అందులో కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఈమేరకు సవరించిన బడ్జెట్ అంచనా ల్లో సర్కారు పేర్కొంది. మిగతా రూ. 150 కోట్లను ప్రభుత్వం ఇంకా వ్యయం చేయలేదు. ఈసారి మాత్రం రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ, సవరించిన అంచనాల్లో నిధులను పెంచుతారా ? లేక తగ్గిస్తారా ? అనే సంగతి సందేహాస్పదంగానే ఉంది. అది తేలాల్సి ఉంది. దీంతో భూ సేకరణ వ్యవహారంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అను మానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉత్తర భాగానికి సుమారు 4700 ఎకరాల భూమి అవసరమ వుతుంది. దీనికోసం మొత్తం రూ.4000 కోట్లు అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి 50 శాతం చొప్పున భరించాల్సి ఉంటుంది. అంటే రూ. 2000 కోట్ల చొప్పున వ్యయం చేయాలి. గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు, ఖర్చును పరిశీలిస్తే, పూర్తిస్థాయిలో వ్యయం చేసినా ఇంకో రూ.1100 కోట్లు భూసేకరణకు అవసరం కానున్నాయి.
మరో ఏడాది
ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల కొరత నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ మరో సంవత్సరం పట్టే అవకాశం ఉందని పేరు రాయడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. భూసేకరణ వేగంగా సాగకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని సమాచారం. ఇప్పటికే ఈ ఉత్తరభాగం ప్రాజెక్టుకు రూ. 9,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, నిధులు ఆలస్యంగా ఇస్తే, ఆ వ్యయం సైతం మరింత పెరగనుంది. ఈ నేపథ్యం లో నిధులు పెంచితేగానీ, భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగదని చెబుతున్నవారూ ఉన్నారు. అయితే బడ్జెట్లో కేటాయించకపోయినా, అవసరాన్ని బట్టి ప్రభుత్వం నిధుల ను ఇస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ, నిధులు తదితర అంశాలపై ఇటు ఆర్‌ఆండ్‌బీ, అటు ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.