Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుముఖ ప్రజ్ఞాశాలి, త్యాగశీలి
- ఆయన మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు
- బలమైన భూ పోరాటాలు, కూలిపోరాటాలను నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళి: సంతాప సభలో వ్యవసాయకార్మికసంఘం ప్రధానకార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉన్నత వర్గంలో పుట్టి ఉన్నతమైన చదువులు చదివి అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి సునీత చోప్రా అని వ్యవసాయకార్మికసంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. దేశవ్యాప్తంగా భూ పోరాటాలను, కూలి పెంపు పోరాటాలను ఉధతం గా నిర్వహించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం సంఘం రాష్ట్ర అధ్యక్షు లు జి నాగయ్య అధ్యక్షతన సునీత్చోప్రా సంతాప సభను నిర్వహించారు. అనంతరం తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం విస్తత సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నేతలు సునీత్ చోప్రా చిత్రపటానికి పూలమాలలేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా బి. వెంకట్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై ప్రజా ఉద్యమాల్లోకొచ్చిన సునీత్ చోప్రా ఢిల్లీ, కలకత్తా, లండన్ యూని వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించారని వివరిం చారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఎస్ఎఫ్ఐ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. జలంధర్‌లో జరిగిన డీవైఎఫ్ఐ మహాసభలో మొదటి ట్రెజరర్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. 1986 పాలఘాట్లో జరిగిన అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభ నుండి మొన్న బెంగాల్లో జరిగిన అఖిలభారత్ పదో మహాసభ వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారని చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలు జరిపిన అనేక భూ పోరాటాలు, కూలి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు.
దేశంలో కార్పొరేట్, మతోన్మాద శక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వెంకట్ ఈ సంద ర్భంగా పిలుపునిచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు వంట సామాను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా కట్ట బెడుతున్నదని చెప్పారు. పేదలకు మాత్రం 60 గజాల ఇంటి జాగా ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్లు ఇండ్లు కట్టి పేదలకు ఇస్తామని చెప్పిన బీజేపీ సర్కార్ ఎనిమిదేండ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని చెప్పారు.
వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం, గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను అమలు చేయ కుండా మోడీ ప్రభుత్వం తొక్కి పెడుతున్నదని, దేశవ్యాప్తంగా పోడు సాగు దారులుగా ఉన్న ఆదివాసి గిరిజనులకు, గిరిజనేతర పేదలకు భూమిపై హక్కు పత్రాలు ఇవ్వకుండా కార్పొరేట్ బహుళజాతి కంపెనీ లకు ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం పేరుతో, అడవులు పెంచడమనే పేరుతో విలువైన అటవీ భూములు, ఇతర సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టా లని చూస్తుందని వివరించారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు నిరుద్యోగాన్ని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పెరిగిన ధరల కనుగుణంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల కనీస వేతనాల జీవోలను సవరించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరి స్తుందని తెలిపారు గ్రామీణ ఉపాధి హామీ నిధులను రూ. లక్ష కోట్ల నుండి రూ.60 వేలకోట్లకు కుదించిందని వివరించారు. ఆధార్ కార్డు, జాబ్‌కార్డు, బ్యాంక్ అకౌంటు ఆన్లైన్ అనుసంధానం పేరుతో కోట్లాదిమంది పేదలకు పని దినాలకు తగ్గించిందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల కనుగుణంగా రోజు కూలి రూ.600 ఇవ్వాలని, ఉపాధి పనిని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలు 55 వేల గుడిసెలను వేలాది ఎకరాల్లో వేసుకుని నివాసం ఉంటున్నారని, వీరందరికీ జీవో నెంబర్ 58, 59 ప్రకారం స్థలాలను క్రమబద్దీకరించి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు లక్షల మంది పోడు సాగుదారులకు హక్కు పట్టాలు సిద్ధం చేశామని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో ఒక్కరికి కూడా హక్కు పట్టా ఇవ్వలేదని అన్నారు. తక్షణమే సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ చట్ట ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదలతో ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యకాస అఖిలభారత కమిటీ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, నారి ఐలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వరరావు, బొప్పన పద్మ పాల్గొన్నారు.